రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

Balapur Laddu 2025 Price: రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే ఠక్కున గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికే ఈ లడ్డూ.. ఈసారి కూడా రికార్డు ధర పలికింది. ఇవాళ ఉదయాన్నే చివరి పూజలు అందుకున్న లంబోదరుడు బాలాపూర్ బొడ్రాయి చౌరస్తాకు చేరుకున్నాడు. అనంతరం లడ్డూ వేలం వేయగా.. గత రికార్డులను బద్దలు కొడుతూ 35 లక్షలకు క‌ర్మాన్‌ఘాట్ కు చెందిన లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్‌ అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. గతేడాది కంటే ఈసారి ఈసారి 4 ల‌క్ష‌ల 99 వేల‌కు ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం. వేలం అనంతరం లింగాల ద‌శ‌ర‌థ‌గౌడ్‌ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు. రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా పోటాపోటీగా సాగిన వేలంలో ద‌శ‌ర‌థ గౌడ్‌ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం పాట 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఆ ఏడాది బాలాపూర్‌కే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ. 450కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ. వందల నుంచి వేల‌కు… రూ.లక్షలకు చేరింది.

లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో గ‌త ఏడాది కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్‌ చేయాలని నిబంధన పెట్టారు. ఈ వేలం పాట‌లో మొత్తం 38 మంది పాల్గొన‌గా, ఏడుగురు కొత్త‌గా వేలం పాట‌లో పాల్గొన్నారు. ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు మధ్య ఈ వేలం పాట కొన‌సాగింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like