వెళ్లిరా మా తండ్రి… మళ్లీ రా…
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం లక్షలాది భక్తుల కోలాహలం మధ్య నిర్విఘ్నంగా కొనసాగింది. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఖైరతాబాద్ గణేషుడి వద్ద దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. రాత్రి 12.01 గంటలకు ఖైరతాబాద్ గణేశుడికి కలశ పూజ చేశారు. అనంతరం 70 టన్నుల భారీ గణనాథుడిని హుస్సేన్‌సాగర్‌కు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసి తరలించారు. ఈ విగ్రహాన్ని తరలించేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా వాహనాన్ని తెప్పించారు.
ఈ ఏడాది 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదురుడు 9 రోజుల పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. సరిగ్గా 1.21 గంటలకు మాహా గణపతి నిమజ్జనం పూర్తయింది. బడా గణేషుడి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో హోరెత్తిపోయాయి. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఎన్టీఆర్ మార్గ్ బహూబలి క్రేన్ నంబర్ 4 వద్ద గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అంతకు ముందు ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కన్నుల పండుగలా సాగింది. ఉదయం ఐదున్నర గంటలకే చివరి పూజల అనంతరం గణపతి శోభాయాత్ర ప్రారంభించారు. వెల్డింగ్ వర్క్ అనంతరం టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాలకు శోభాయాత్ర చేరుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బహుబలి క్రేన్ నెంబర్ 4 దగ్గర చివరి పూజల అనంతరం ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు.