పాలస్తీనా జెండాలతో ముస్లిం యువకుల ర్యాలీ
మిలాద్ ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం యువకులు నిర్వహించిన ర్యాలీలో కలకలం చోటు చేసుకుంది. కాకినాడ భానుగడి జంక్షన్ లో కొందరు పాలస్తీనా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కొన్ని కార్లపై పాలస్తీనా జాతీయ జెండాలను ప్రదర్శించడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి, ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిలాద్ ఉన్-నబీని పురస్కరించుకుని కొందరు ముస్లిం యువకులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నాలుగు కార్లపై పాలస్తీనా జెండాలను కట్టి ప్రదర్శించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి, ఆ నాలుగు కార్లను సీజ్ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు ఈ జెండాలను ఎందుకు ప్రదర్శించారు? వాటిని ఎవరు తయారు చేశారు? ఈ ఘటన వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
దీనిపై పోలీసు అధికారులు మాట్లాడుతూ పాలస్తీనా జెండాలతో ర్యాలీ నిర్వహించిన నాలుగు కార్లను సీజ్ చేశాం. కొందరు యువకులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని మీడియాకు వెల్లడించారు. కేవలం పాలస్తీనా జెండాలే కాకుండా వివిధ రకాల చిహ్నాలున్న ఇస్లామిక్ బ్యానర్లను కూడా రెపరెపలాడించారు. ఈ ఘటనపై ముస్లిం మత పెద్దలు సైతం వారిని వివరణ అడిగినట్లు తెలుస్తోంది.