సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డికి ఊర‌ట‌

సీఎం రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టుల‌ను రాజకీయ పోరాటాల‌కు వేదిక చేసుకోవద్దంటూ స్ప‌ష్టం చేసింది. కేసు డిస్మిస్ చేసిన త‌ర్వాత కూడా బీజేపీ త‌ర‌ఫు న్యాయ‌వాది వ్య‌వ‌హారాన్ని పొడిగిస్తున్నార‌ని, రూ. 10 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తామంటూ హెచ్చ‌రించింది ధ‌ర్మాస‌నం. రాజ‌కీయాల‌ను రాజ‌కీయాల‌తో తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌-125 కింద కేసు కొనసాగుతుందని తెలిపింది. దీంతో రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ సోమవారం చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు రాగా, దానిని డిస్మిస్ చేస్తూ దేశ ఉన్న‌త న్యాయ స్థానం తీర్పు చెప్పింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like