ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం
Vice President Election 2025:ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎన్నిక జరుగుతోంది. 101 వసుధ హాల్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎన్నిక సాయంత్రం 5 వరకు జరగనుంది. ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటించనున్నారు..
కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు.. ఎన్డీఏ అభ్యర్ధిగా రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. విజయానికి మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు.. సీపీ రాధాకృష్ణన్‌కే ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉంది. దీంతో ఆయన గెలిచే అవకాశం ఉంది. ఉభయ సభల్లో ఈరోజు 770 మంది ఎంపీలు ఓటు వేయబోతున్నారు. ఇందులో 542 మంది లోక్‌సభ ఎంపీలు , 228 మంది రాజ్యసభ ఎంపీలున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంఎల్‌ఏలు కూడా ఓటు వేయగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కేవలం ఎంపీలు మాత్రమే ఓటు వేస్తారు. ఈసారి మొత్తం 781 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో లోక్‌సభ నుంచి 542 మంది (స్పీకర్‌ను మినహాయించి), రాజ్యసభ నుంచి 239 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్ వర్తించదు. అంటే ప్రతి ఎంపీ తన వ్యక్తిగత అభిరుచి, ప్రాధాన్యత ఆధారంగా ఓటు వేయాలి. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఎంపీలు బ్యాలెట్ పేపర్‌పై తమ మొదటి, రెండో, మూడో ప్రాధాన్యతలను గుర్తించాలి. ఆ తర్వాత మొత్తం ఓట్లలో సగానికి పైగా చెల్లుబాటు అయ్యే ఓట్లు పొందిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు.