లంచం కోసం పీడించింది… దొరికినంక ఏడ్చేసింది…
ACB Raids:లంచం కోసం డిమాండ్ చేయడం.. ఆ తర్వాత కన్నీరు కార్చడం ఈ మధ్య అవినీతి అధికారులకు కామన్ అయిపోయింది.. ఓ వైపు ఏసీబీ దాడులు.. మరోవైపు అధికారుల లంచాలు మాత్రం ఆగడం లేదు. ఇన్ని రోజులు కేవలం పురుష అధికారులు మాత్రమే ఏసీబీకి చిక్కేవారు.. ఇప్పుడు మహిళా అధికారులు సైతం తామేమీ తక్కువ తినడం లేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఓ మహిళా అధికారి ఏకంగా రూ.నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. వారు పట్టకున్నాక భోరున విలపించింది…
హైదరాబాద్ (Hyderabad) శివారులోని నార్సింగి (Narsingi) మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఓ వ్యక్తి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్‌ను క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రూ. పది లక్షల లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం బాధితుడి నుంచి రూ. నాలుగు లక్షల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ తర్వాత ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆమెపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత మణిహారిక భోరున విలపించింది.