రోజుకు 600 టన్నుల పేలుడు పదార్థాలు
ఓబీ తొలగింపునకు ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలి - ఎక్స్ ప్లోజివ్స్ తయారీ, సరఫరాదారులకు డైరెక్టర్ల ఆదేశం
సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పేలుడు పదార్థాలను ఆటంకం లేకుండా సరఫరా చేయాలని డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), బలరామ్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్,ఫైనాన్స్,పర్సనల్) ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు కనీసం 600 టన్నుల పేలుడు పదార్థాలు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఉత్పత్తి పెంచేందుకు కీలకమైన ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరాపై బుధవారం అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, జీఎం (కోఆర్డినేషన్,మార్కెటింగ్) సూర్యనారాయణతో కలిసి డైరెక్టర్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 80 శాతం మేరకు సరఫరా జరుగుతోందని, దీన్ని 100 శాతానికి పెంచాలని స్పష్టం చేశారు. కొద్దిరోజుల్లోనే నూతన ఉపరితల గని జీడీకే ఓ.సి,మణుగూరు ఓసీలోనూ ఉత్పత్తికి చర్యలు తీసుకోనున్నందున పేలుడు పదార్థాల అవసరం పెరగనుందన్నారు.వంద శాతానికి సరఫరా పెంచాలని ఆదేశించారు. కొన్ని గనుల్లో బ్లాస్టింగ్ విఫలమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నాణ్యమైన ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా చేయాలని కోరారు. అవసరానికి అనుగుణంగా గనులకు ఎక్స్‌ప్లోజివ్స్ సమకూర్చాలని స్పష్టం చేశారు.
గతంలో జరిగిన సమావేశం మేరకు ఎక్స్ ప్లోజివ్స్ తయారీదారులు, సరఫరాదారుల సమస్యలను చాలావరకు పరిష్కరించిన విషయాన్ని డైరెక్టర్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్ణీత లక్ష్యాల మేరకు ఓబీ, బొగ్గు తొలగింపు కోసం ఏరియాల వారీగా వివిధ గనుల అవసరాల మేరకు కావాల్సిన ఎక్స్‌ప్లోజివ్స్ వివరాలను సంబంధిత జనరల్ మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో జనరల్ మేనేజర్ కో ఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ బ్లాస్టింగ్ ఇంచార్జ్ లు, సర్వే అధికారులు, ఆఫ్ లోడింగ్ ప్రతినిధులు రోజు సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. సమన్వయంతో బ్లాస్టింగ్ కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే పౌడర్ ఫ్యాక్టర్ ను మరింత మెరుగు పరిచేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్లోజివ్స్ తయారీ, సరఫరా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ సింగరేణి ఇండెంట్‌కు అనుగుణంగా సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సింగరేణి భవన్ నుంచి జీఎం (సీపీపీ) నాగభూషణ్‌రెడ్డి, జీఎం (పీపీ) సత్తయ్య, జీఎం (ఎంపీ) రమేశ్‌రావు, జీఎం (స్ట్రాటెజిక్‌ప్లానింగ్) జి.సురేందర్, జీఎం (ఎక్స్‌ప్లోజివ్స్) ఎన్.వి.రావు, కార్పోరేట్ నుంచి ఎస్వోటూ డైరెక్టర్లు దేవీ కుమార్, రవి ప్రసాద్, అన్ని ఏరియాల నుంచి జీఎంలు, ఎక్స్ ప్లోజివ్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.