కాంగ్రెస్–బీఆర్ఎస్ ఘర్షణ.. ఫ్లెక్సీ తొలగింపుతో ఉద్రిక్తత

ఓ ఫ్లెక్సీ వివాదం రెండు పార్టీల న‌డుమ ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. అది కాస్తా దాడుల వ‌ర‌కూ వెళ్లింది. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే కాంగ్రెస్ నేత‌లు త‌మ‌పై దాడుల‌కు దిగార‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డ్డ బీఆర్ఎస్ నేత‌ల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మంచిర్యాల కార్పొరేష‌న్ ప‌రిధి న‌స్పూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బోనాల జాతర సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపాలిటీ 21వ వార్డు మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు చింపేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బేర సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పక్కనే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కూడా ఉంది. అయితే, మున్సిపాలిటీ అధికారులు తమ ఒక్క దాన్నే తొలగించమని ఫోన్ చేస్తున్నారని, కాంగ్రెస్ ఫ్లెక్సీ తొలగిస్తే తనది కూడా తీసేస్తానని ఆయన స్ప‌ష్టం చేశారు. అయితే మంగళవారం కొందరు కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని స్వయంగా తొలగించడం ప్రారంభించారు.

దీంతో ఈ వ్య‌వహారం కాస్తా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. విషయం తెలుసుకున్న సత్యనారాయణ, కాటం రాజు, ప్రశాంత్‌తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ బయట కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మోహరించి, బయటకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. కాటం రాజు తీవ్రంగా గాయపడగా, సత్యనారాయణకూ గాయాల‌య్యాయి. పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టారు. ఏసీపీ ప్ర‌కాష్ హుటాహుటిన చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గాయ‌ప‌డ్డ బీఆర్ ఎస్ నాయ‌కుల‌ను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కక్ష సాధింపుతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించార‌ని, వారిని అడ్డుకున్న బీఆర్ఎస్‌ నాయకులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం కృషి చేయాలి తప్ప, రాజకీయ కుట్రలకు పాల్పడకూడదని హిత‌వు ప‌లికారు. మంచిర్యాలలో రాజకీయ కక్షలతో రౌడీయిజం, గుండాయిజం పేట్రేగిపోతుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like