15 నుంచి మంచిర్యాలలో వందేభారత్ హాల్ట్
Secunderabad-Nagpur Vande Bharat Express Train:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 15 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు. కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా వందేభారత్ రైలు హాల్ట్ ఉంటుందన్నారు. 15 ఉదయం 8.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ (20101) నాగ్ పూర్-సికింద్రాబాద్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు.
గత సంవత్సరం సెప్టెంబరులో సికింద్రాబాద్ – నాగ్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు మొదలైనప్పటి నుంచి ఈ రైలు మంచిర్యాలలో నిలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాలు పలుమార్లు రైల్వే ఉన్నత అధికారులతో పాటు ఎంపీ వంశీకృష్ణ లోక్సభలో ప్రస్తావించారు. ఈ విషయంపై స్పందించిన రైల్వే శాఖ ఎట్టకేలకు కాగజ్నగర్, మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభారత్ నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
మంచిర్యాల నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు ప్రతి రోజు ఉదయం 5 గంటలకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు ఉంది. తరువాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటర్సిటీ, మధ్యాహ్నం 3.40 గంటలకు కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 గంటలకు తరువాత రాష్ట్ర రాజధానికి వెళ్లాలని అనుకుంటే రోడ్డు మార్గం ఒక్కటే దిక్కు. హైదరాబాద్కు వెళ్లినా ఉదయం 11 గంటలకు చేరుకుంటాము. బస్సు మార్గంలో 5 గంటలకుపైగానే టైం పడుతోంది. వందేభారత్ రైలు అందుబాటులోకి రావడంతో మంచిర్యాల జిల్లావాసులకు హైదరాబాద్కు కేవలం 3 గంటల్లోనే చేరుకునే వెసులుబాటు ఉంటుంది.