సింగ‌రేణిపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Singareni:ఇకపై జరిగే బొగ్గు గనులు, ఇతర ఖనిజ గనుల వేలం పాటలో సింగరేణి పాల్గొనేలా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది సంస్థ‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖా మంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్ల‌డించారు. హైదరాబాద్లో సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ప్రకటన చేశారు. “ఇప్పటివరకు వేలంపాటలో పాల్గొనలేకపోవడం వల్ల సింగరేణి రెండు పెద్ద బొగ్గు బ్లాకులతో పాటు 60 వేల కోట్ల రూపాయాల రెవెన్యూ కోల్పోయింది. సింగరేణి వేలం పాటలో బ్లాకులు పొందాలని, అందుకు అనుమతించాలని కార్మిక సంఘాలు, సింగరేణి బోర్డు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేసే 40,000 మంది కార్మికుల, 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్తు, సింగరేణి మనుగడ దృష్ట్యా ఇకపై వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనాలని నిర్ణయించామని” భట్టి విక్రమార్క ప్ర టించారు.

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికుల భవిష్యత్తు, సంస్థ మనుగడ, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించే బొగ్గు గనుల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. కొత్త బ్లాకులు సాధించాలని నిర్ణయించినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికి సొంతమై ఉండేవని, కానీ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేటాయించడం ప్రారంభించిందన్నారు.

అయితే పలు రకాల భ్రమలు, అపోహలు, భావోద్వేగాల కారణంగా సింగరేణిని వేలంపాటలో పాల్గొనకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ వేలం పాటలో పాల్గొనకుండా ఉన్నందువల్ల సింగరేణి ప్రాంతంలోనే ఉన్న రెండు పెద్ద బ్లాకులు సత్తుపల్లి, కోయగూడెం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. తద్వారా సింగరేణికి రూ. 60 వేల కోట్ల రెవెన్యూను, రూ. 15 వేల కోట్ల లాభాలను కోల్పోయింద‌న్నారు. ఇది చాలా ఘోర తప్పిదమన్నారు. వేలంలో సింగరేణి పాల్గొనకపోతే అది ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చుతుందని చెప్పారు.

వేలంలో ప్రైవేట్ వ్యక్తులకు బ్లాక్ లు దక్కినా రాష్ట్రానికి రాయల్టీ వస్తుందని, అదే సింగరేణి వేలంలో గనులు దక్కించుకుంటే 40 వేల మంది ఉద్యోగులు, 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్ కు బాటలు వేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కి మనుగడ ఉంటుందన్నారు. వేలంలో కేంద్రానికి వచ్చే ఆదాయం ఉండదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ సంస్థలు బొగ్గు వేలంపాటలో పాల్గొని బ్లాకులు సాధిస్తున్నప్పుడు సింగరేణి కూడా పాల్గొంటే తప్పేమిటి? అన్నారు. పైగా వేలంలో బ్లాకులు పొందినందువల్ల సింగరేణి సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపం లో లాభం చేకూరనుందని అలాగే టాక్స్ ల రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది అన్నారు .

సింగరేణిలో ప్రస్తుతం 38 గనులు ఉన్నాయని కానీ ఈ గనులలో బొగ్గు నిల్వలు తరిగిపోతూ ఉండటం వల్ల మరో ఐదేళ్లలో పది గనులు మూతపడనున్నాయ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. తద్వారా ఎనిమిది వేల మంది ఉద్యోగులు అవసరానికి మించి ఉంటారన్నారు. వారి ఉద్యోగ భద్రత కోసం కొత్త గనులు అవసరమని వివ‌రించారు. ప్రస్తుతం సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోందని కొత్త బ్లాకులు రానట్లయితే ఈ ఉత్పత్తి సగానికి పైగా పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి సింగరేణి సంస్థ పై ఆధారపడి ఉన్న 40వేల మంది కార్మికులు, పరోక్షంగా ఆధారపడి ఉన్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇకపై జరిగే ఏ వేలంపాటలో అయినా సింగరేణి పాల్గొనే విధంగా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ గానే కాక సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ రంగాలలో కూడా ప్రవేశిస్తుందని భట్టి విక్రమార్కమల్లు వెల్లడించారు. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటులో ముందుకు సాగుతోందన్నారు. ఇందుకోసం కన్సల్టెన్సీని కూడా నియమించుకుందన్నారు. నేడు దేశీయంగా కీలక ఖనిజాలకు ఎంతో డిమాండ్ ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కూడా కీలక ఖనిజాల ఉత్పత్తి కోసం రంగం సిద్ధం చేసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ కీలక ఖనిజాల ఉత్పత్తికి అవకాశం ఉందో పరిశీలించడం కోసం సింగరేణి సంస్థ ఒక ఏజెన్సీని కూడా నియమించుకుందని, ఆ ఏజెన్సీ ఇచ్చే లాభదాయక సూచనలను పరిగణనలోకి తీసుకొని “సింగరేణి గ్లోబల్” పేరుతో ప్రపంచంలోని పలు దేశాల్లో కీలక ఖనిజాల ఉత్పత్తిని సింగరేణి సంస్థ ప్రారంభించనుందని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇటీవల జరిగిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు లోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి అన్వేషణకు 37.75% రాయల్టీతో లైసెన్సు సాధించిందని అన్వేషణ పనులు త్వరలో ప్రారంభిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన కార్మికులు, అధికారులు ఉన్నారని అయితే బొగ్గు బ్లాకులు లేకపోవడం వల్ల ఇది సాధ్యం కావడంలేదన్నారు. వేలంపాటలో పాల్గొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపడం వల్ల కొత్త బ్లాకులను సింగరేణి సంస్థ చేపట్టడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఇందుకు సింగరేణి సంస్థ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like