రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం
కార్మిక, మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామి
Minister Vivek: రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. లక్ష్సెట్టిపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. తెలంగాణకు యూరియా లోటు రాకుండా చూడాలని కూడా గతంలోనే కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. యూరియా కొరత తీర్చేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చించి అదనపు యూరియాను రాష్ట్రానికి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక రేక్ లు ఏర్పాటు చేసి మంచిర్యాల జిల్లా రైతులకు యూరియా లోటు లేకుండా చేస్తామన్నారు. కొందరు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని రైతులను పక్క దారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.అంతకుముందు పలువురు కార్యకర్తలు మంత్రి దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని గుర్తించాలని కోరారు. కొందరికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పెరుగు తిరుపతి, దమ్మ సునీల్, కళ్యాణం రవి, మినుములు శాంతి కుమార్, మాలేం చిన్నయ్య, గరిసే రవీందర్, మూల కిషన్ గౌడ్, దమ్మ నారాయణ, మూల లచ్చన్న, మల్లేష్ పాల్గొన్నారు.