దయ్యాలు వేదాలు వల్లించినట్లే..
కల్వకుంట్ల కవితపై NTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆగ్రహం
సింగరేణి అవినీతి గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సింగరేణిలో పెద్ద ఎత్తున అవినీతి జరగుతోందని కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. మీరు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న TBGKS యూనియన్ నాయకులు 10 ఏళ్ళు సింగరేణిని వంచించి, కార్మికుల రక్తం పీల్చారని అన్నారు. దానిఫలితంగా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులు మీ MLA, MPలను చిత్తుగా ఓడించి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మీ యూనియన్ ను కనీసం పోటీ చేయని పరిస్థితికి తీసుకవచ్చారు. అప్పుడే మరచిపోయారా? అని ప్రశ్నించారు.
అది మీ యూనియన్ నేతల అవినీతికి తార్కాణం కాదా..? అని అన్నారాయన. మీరు పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కుట్రపూరిత MMDR చట్టానికి మద్దతు తెలిపింది మీరు కాదా..? బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా కుట్ర చేసి, మీ పార్టీ బినామీలకు బ్లాకులు వెళ్లేలా పరోక్షంగా వ్యవహరించింది మీ పార్టీ కాదా…? అని ఎద్దేవా చేశారు. దాని వల్ల సంస్థకు ₹60,000 కోట్ల భారీ నష్టం వాటిల్లింది ఇది నిజం కాదా? ఇది ఎవరి వైఫల్యం…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇంట్లో పంచాయితీతో కొత్త కుంపటి పెట్టి ఇప్పుడు కార్మికులపై కపటప్రేమ చూపించడం ఏంటి..? 10 ఏళ్ళు మీ యూనియన్ గుర్తింపుసంఘంగా ఉన్నప్పుడు కార్మికుల కోసం ఏమి చేసారు..? కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ సభలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. ఇకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సింగరేణి ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉత్పత్తి, రవాణా, లాభాలు సాధించిందని జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ “తెలంగాణలో ఒక్క కాంట్రాక్టు కార్మికుడు లేడ”ని అబద్దం చెప్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలోని 30,000 కాంట్రాక్టు కార్మికులకు దేశంలో ఎక్కడ లేని విధంగా ₹5,000 లాభాల వాటా ఇచ్చింది నిజం కాదా అన్నారు.
మీరు 10 ఏళ్ళలో చేయలేనిది, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 రోజుల్లోనే చేసిందన్నారు. డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలకు పెంచామన్నారు. కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా, కాంట్రాక్ట్ కార్మికుల 40 లక్షల భీమా, కాంట్రాక్టు కార్మికులకు ₹5,000 బోనస్, BC లైజనింగ్ అధికారుల నియామకం, రాజస్థాన్ ప్రభుత్వంతో సోలార్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందం, త్వరలో హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, సింగరేణిని విస్తరించి కర్ణాటకలో బంగారు, రాగి గనులు సాధించడం ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు మాని కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయాలని కల్వకుంట్ల కవితకు జనక్ ప్రసాద్ హితవు పలికారు.