మావోయిస్టు అగ్రనేత సుజాతక్క లొంగుబాటు
ఆమెపై 106 కేసులు.. కోటి రూపాయల రివార్డు… కేంద్ర కమిటీ సభ్యుల్లో ఏకైక మహిళా నాయకురాలు… దివంగత అగ్రనేత కిషన్‌జీ భార్య.. 44 ఏండ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం… పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
గద్వాల్ ప్రాంతానికి చెందిన సుజాత చాలా చిన్న వయసులోనే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. 1984లో ఆమె మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆమెపై వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 106 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా, జనతన సర్కార్ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది నుంచి సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆమె సొంత జిల్లా అయిన మహబూబ్ నగరకు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు దండకారణ్యం, అయీజ్ మద్ అడవుల్లో పోలీసులు, భద్రతాదలాల నిర్బంధం పెరిగిపోయింది. అలాంటి సమయంలో వయోభారం, అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడుతున్న సుజాత లొంగిపోవడానికి నిర్ణయించకున్నారని సమాచారం. గత ఏడాది ఆమె అరెస్టు అయ్యారని కూడా మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, దానిని పోలీసులు ధృవీకరించలేదు.
43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో..
మహబూబ్ నగర్ కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో పరిచయం అయింది. ఈ క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలుగా గుర్తింపు పొందారు. కల్పన అలియాస్ సుజాతక్క, మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయి తదితర పేర్లతో పిలుస్తారు.
సుజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆమె భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్ జార్‌గ్రామ్‌లోని బురిషోల్ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు.