రైలు రాజకీయం…
Vande Bharat halting in Mancherial:మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు రైలు రాజకీయం నడుస్తోంది… సోమవారం నుంచి వందేభారత్ రైలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగనుంది. అయితే, ఆ రైలును తామే ఆపిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ చెబుతుండగా, లేదు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి తామే ఆపిస్తున్నామని బీజేపీ చెబుతోంది… కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో పోస్టులతో హంగామా చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రైలు సౌకర్యం తక్కువే అని చెప్పాలి. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో భాగ్యనగర్ వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటర్‌సిటీ, మధ్యాహ్నం 3.40 గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 గంటలకు తరువాత రాష్ట్ర రాజధానికి వెళ్లాలని అనుకుంటే రోడ్డు మార్గం ఒక్కటే దిక్కు. హైదరాబాద్‌కు వెళ్లినా ఉదయం 11 గంటలకు చేరుకుంటాము. బస్సు మార్గంలో 5 గంటలకుపైగానే టైం పడుతోంది. వందేభారత్ రైలు అందుబాటులోకి రావడంతో మంచిర్యాల జిల్లావాసులకు హైదరాబాద్‌కు కేవలం 3 గంటల్లోనే చేరుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు నుంచి వందేభారత్ మంచిర్యాలలో ఆగనుంది.
ఇక్కడి వరకు బాగానే ఉంది… వందేభారత్ ఆగడంలో తామే కృషి చేశామంటే… లేదు తమ వల్లనే అయ్యిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పుకుంటున్నాయి. వందేభారత్ ఇక్కడ ఆగుతుందని రైల్వే అధికారులు ప్రకటన చేయగానే ఎంపీ వంశీకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాను పార్లమెంట్‌లో వందేభారత్, ఇతర రైళ్లను ఆపించేందుకు మాట్లాడానని అంతేకాకుండా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే అధికారులతో మాట్లాడానని అందుకే ఈ రైలు ఆగుతోందని పోస్టు చేశారు. దీంతో ఆయన అనుచరులు సైతం ప్రజలకు మేలు జరిగేలా తమ నేత మంచి పని చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు..
అదే సమయంలో బీజేపీ నేతలు సైతం తమ వల్లే ఈ రైలు ఆగుతోందంటూ రాగం అందుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాల వల్లే వందేభారత్ రైలు మంచిర్యాలలో ఆగుతోందంటూ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు, తాము రైల్వే అధికారులను ఒప్పించి ఈ రైలు నిలుపుదల చేయిస్తామని ఆయన సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో కేంద్ర మంత్రిని కలిసినవి, రైల్వే అధికారులను కలిసిన ఫోటోలు పెట్టి మరీ వాట్సప్, ఇతర మాధ్యమాల వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు సైతం అదే స్థాయిలో ప్రచారం హోరెత్తిస్తున్నారు.
ఈ రోజు కేంద్రమంత్రి బండి సంజయ్ వందేభారత్ రైలు హాల్టింగ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సోషల్‌మీడియా వార్ హోరెత్తిపోతోంది. రైలు నిలుపుదల విషయంలో చేసిన ప్రయత్నం మంచిదే అయినా… ఒక్క రైలు హాల్టింగ్ కోసమే ఇంత రాద్దాంతం ఎందుకని మంచిర్యాలకు ఏదైనా పెద్ద ప్రాజెక్టు మంజూరు చేయిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని, అప్పుడు జనానికి చెప్పవచ్చని మంచిర్యాల వాసులు చెబుతున్నారు.