భార్య‌, ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌తో స‌హా ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Family of auto driver who committed suicide on the highway:లంచం కోసం రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటోడ్రైవర్ కుటుంబం నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు లంచం ఇవ్వ‌క‌పోతే ప‌ని చేయ‌మంటూ వేధిస్తున్నారంటూ తన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా.. ఆటో కాలిపోయింది. ఆయ‌న‌కు చేతుల‌కు స్వ‌ల్ప‌గాయాలు కాగా, అదృష్ట‌వ‌శాత్తు భార్య ముగ్గురు పిల్ల‌ల‌కు ఏం కాలేదు…

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన శంకర్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తాత పేరు మీద ఉన్న 1.28 ఎకరాల భూమి తన పేరుపై మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నఆయ‌న ఆర్డీవో కార్యాలయానికి ఆన్‌లైన్‌లో ఫైల్ కోసం వెళ్లగా ఆఫ్‌లైన్‌లో తమకు రాలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆర్ఐ సాహత్ ను క‌లిశాడు. త‌న‌కు రూ.15 వేలు ఇవ్వాలని లేక‌పోతే ప‌నిచేయ‌న‌ని సాహ‌త్ స్ప‌ష్టం చేశాడు. దీంతో తనవద్ద అంతలేదని రూ.5 వేలు ఇచ్చాడు. అయితే, మిగిలిన డ‌బ్బులు ఇస్తేనే దస్త్రం కదులుతుందని చెప్పారని బాధితుడు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

దీంతో ఆ ఆటోడ్రైవర్ మనస్తాపానికి గురై తన భార్య జ్యోతి, ముగ్గురు కూతుళ్లపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. పెట్రోల్ పోసుకున్న వెంటనే ఆటోకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో శంకర్ చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు అతని భార్య, పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఆర్ఐ సాహత్‌ను ప్రశ్నించారు. శంకర్ రెండు నెలల కింద‌టే ఇనాం భూమికి సంబంధించిన ఓఆర్‌సి తెచ్చుకున్నాడని, ఆ తర్వాత తాను విచారణ జరిపి దస్త్రం పంపించానని సాహత్ తెలిపారు. శంకర్ నుంచి తాను ఎటువంటి డబ్బులు డిమాండ్ చేయలేదని సాహత్ స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like