కంది శ్రీ‌నివాస్‌కు కాంగ్రెస్ షాక్‌

-కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరిన మాజీ నేతలు
-కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ అధ్యక్షుడు
-కంది శ్రీ‌నివాస్‌కు వ్య‌తిరేక నిర్ణ‌య‌మంటున్న నేత‌లు

Congress:కంది శ్రీ‌నివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్న స‌మ‌యంలో హ‌స్తం పార్టీ మాజీ నేత‌ల‌కు తిరిగి ప్ర‌వేశం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఒక‌వైపు డీసీసీ ప‌ద‌వుల పందేరం కొన‌సాగుతున్న త‌రుణంలో బ‌హిష్కృత‌నేత‌ల‌ను మ‌ళ్లీ పార్టీలోకి ఆహ్వానించ‌డంతో ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న నేత‌ల ఆశ‌లు గ‌ల్లంత‌యిన‌ట్లేనా..? అనే చ‌ర్చ ఊపందుకుంది. పార్టీకి పాత నేత‌ల అవ‌స‌రం ఉందా..? లేక నేత‌ల‌కే పార్టీ కావాల్సి వ‌చ్చిందా అనేది ప‌క్క‌న పెడితే ఉన్న నేత‌ల్లో మాత్రం ఉలిక్కిపాటు మొద‌లైంది. అధిష్టానం నిర్ణ‌యం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ఎలాంటి ట‌ర్న్ తీసుకోబోతోంది. ఏమ‌ని చ‌ర్చ సాగుతోంది…. నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం..

రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ… ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆగ‌మాగం అయ్యింది. జిల్లా అధ్య‌క్షుడు లేక‌పోవ‌డం… ఉన్న నేత‌లు పార్టీని ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఏండ్లుగా పార్టీ కోసం ప‌నిచేసిన వారు బ‌హిష్క‌ర‌ణ‌కు గురయ్యారు. గండ్రత్ సుజాత్, సాజిద్ ఖాన్, సంజీవ రెడ్డిల‌ను పార్టీ స‌స్పెండ్ చేస్తూ అప్పుడు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ లో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారి పెత్త‌నం పెరిగిపోయింది. దీనికి తోడు క‌ట్ట‌ర్ కాంగ్రెస్ నేత‌లు.. ఎన్నిక‌లు ఆ త‌ర్వాత వ‌చ్చిన నేత‌ల మ‌ధ్య గ్యాప్ పెరుగుతూ వ‌చ్చింది. ఇదే కాకుండా, గ‌త రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ వ్య‌వ‌హార శైలితో పాటు ఇత‌ర పార్టీల నుంచి డ‌బ్బున్న నేత‌ల పెత్త‌నం పెరగ‌డంతో కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి పెరిగింది. ఇది కాస్తా పార్టీలో అంత‌ర్గ‌త కుమ్మ‌లాట‌ల‌కు కార‌ణ‌మైంది. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ ఉన్నంత కాలం పెద్ద‌గా ప్ర‌జాబ‌లం లేనివాళ్లు, పైగా వివిధ పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల ఆట‌లు సాగాయి.

ఓట‌మిపై పార్టీ పోస్టుమార్టం…
అయితే, ఇన్‌చార్జీ మంత్రిగా ఉన్న సీత‌క్క మ‌రికొంద‌రు నేత‌లకు సైతం ఇన్‌చార్జీ బాధ్య‌త‌లు ఇచ్చిన‌ప్ప‌టికీ ఎంపీ ఎన్నిక‌ల్లో గెల‌వాల్సిన సీటు కాంగ్రెస్ పార్టీ చేతులారా ఓడిపోయింది. ఒక్క ఆదిలాబాద్ మాత్ర‌మే కాకుండా, చాలా చోట్ల ఎంపీ సీట్ల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింది. రాష్ట్రంలో విజ‌యం సాధించిన పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌వ‌డం వెన‌క అధిష్టానం పోస్ట్ మార్టం చేసింది. ఇది కాస్తా రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ ప‌ద‌వికి ఎస‌రు తెచ్చింది. ప్ర‌జ‌ల్లో లేని నేత‌లు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి పెత్త‌నం చేసిన వారి వ‌ల్ల‌నే పార్టీ ఓట‌మి కావాల్సి వ‌చ్చింద‌నే నివేదిక అధిష్టానికి చేరింది. దీంతో అధిష్టానం న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోనే లొల్లి షురూ..
ఆదిలాబాద్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా గండ్ర‌త్ సుజాత, సంజీవ‌రెడ్డి, సాజిద్‌ఖాన్ త‌దిత‌రులు టిక్కెట్టు ఆశించారు. వీళ్ల ముగ్గురిని కాద‌ని, బీజేపీ నుంచి వ‌చ్చిన కంది శ్రీ‌నివాస్‌రెడ్డికి టిక్కెట్టు కేటాయించ‌డంతో ప‌దేండ్లు పార్టీకి అండ‌గా ఉన్నాం… క‌ష్ట కాలంలో ప‌నిచేసిన త‌మ‌కు అన్యాయం చేశారంటూ కోపోద్రిక్తులైన వారు కొంత‌మంది నేత‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అంత‌ర్గ‌త పోరు ముదురుతూ వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కంది శ్రీ‌నివాస్ రెడ్డి, గండ్ర‌త్ సుజాత‌ను ముక్కు చెవులు కోస్తాన‌ని వ్యాఖ్యానించ‌డంతో మిగ‌తా నేత‌ల‌ను దూరం పెట్ట‌డంతో వివాదం మ‌రింత‌గా రాజుకుంది. అదే ఎన్నిక‌ల్లో సుజాత‌, సాజిత్‌ఖాన్‌, సంజీవ‌రెడ్డి వ‌ర్గం నుంచి ఒక‌రు స్వతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో అధిష్టానం ఆ ముగ్గురిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది.

స్థానిక సంస్త‌ల ఎన్నిక‌ల ముందు మ‌ళ్లీ ఆరంగేట్రం..
ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటు కోల్పోయింది. ఎంపీ ఎన్నిక‌ల‌కు ముందు బ‌హిష్కృత నేత‌ల‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకునేందుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆ నేత‌లు అధిష్టానంతో మాట్లాడ‌టంతో పార్టీ సైతం వారికి గ్రీన్‌సిగ్న‌ల్ తెలిపింది. కానీ, మ‌ధ్య‌లో ఓ నేత వారిని పార్టీలోకి రానీయ‌కుండా అడ్డుప‌డ్డ‌టం, ఇన్‌చార్జీ మంత్రి సీత‌క్క‌, మ‌రోనేత చ‌లువ‌తో వారు పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇక, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ మారిపోవ‌డం, జిల్లాలో త‌న‌దే పెత్త‌నం అని ముందుకు వెళ్లిన ఓ నేత ఆగ‌డాల‌కు క‌ళ్లెం ప‌డ‌టంతో పాత నేత‌ల చేరిక అనివార్య‌మ‌య్యింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ నేత‌ల రాక కాంగ్రెస్‌కు లాభం చేకూరే అంశం కానుంది.

వాళ్లు వ‌చ్చింది అందుకేనా..?
నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీ స్థానికంగా ఉండ‌క‌పోవ‌డం, ఆ పార్టీ ఇచ్చిన కార్యక్ర‌మాల నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి అంశాలు ఇటీవ‌ల జిల్లాకు వ‌చ్చిన ఇన్‌చార్జీ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు నివేదిక అందింది. ఇప్ప‌టికే వ‌ల‌స వ‌చ్చిన నేత‌ల పార్టీకి జ‌రిగిన న‌ష్టాన్ని చాల‌నుకున్న అధిష్టానం ఇక పాత నేత‌ల‌ను పార్టీలోకి తీసుకోవ‌డం మేల‌ని భావించి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు క‌ప్పారు. దీంతో పాత కాంగ్రెస్ నేత‌లు, క‌ట్ట‌ర్ కార్య‌క‌ర్త‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు వాళ్ల‌ను ఎందుకు బ‌హిష్క‌రించారంటే…?
బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కాంగ్రెస్‌లో ఏ నేత‌ల‌ను పార్టీలో కొన‌సాగ‌కుండా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లుపెట్టింది. అలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌లోభాలు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కుండా పార్టీని కాపాడుతూ ప‌దేండ్లుగా అదే పార్టీలో కొన‌సాగారు. టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గండ్ర‌త్ సుజాత‌, మాజీ డీసీసీ అధ్య‌క్షుడు సాజిద్‌ఖాన్‌, మాజీ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ అల్లూరి సంజీవ‌రెడ్డి పార్టీ అదేశాల మేర‌కు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశారు. వీరు టిక్కెట్టు ఆశించ‌డం, మ‌ధ్య‌లో వేరే పార్టీలో నుంచి వ్య‌క్తికి టిక్కెట్టు ఇవ్వ‌డంతో వీరంతా నారాజ్ అయ్యారు. డ‌బ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్టు ఇచ్చార‌ని వీరు ఆరోప‌ణ‌లు గుప్పించారు. దానినే అస్ర్తంగా మ‌లుచుకున్న కొంద‌రు నేత‌లు వారిపై వేటు వేయించారు. అదే స‌మ‌యంలో వారు పార్టీలోకి రాకుండా చాలా కాలం అడ్డుప‌డ్డారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు గండ్రత్ సుజాత్,సాజిద్ ఖాన్,సంజీవ రెడ్డి తిరిగి పార్టీలోకి రావ‌డం ఖ‌చ్చితంగా కంది కి షాక్ ఇచ్చినట్లేన‌ని చెబుతున్నారు. మ‌రి ఇప్పుడు కంది శ్రీ‌నివాస్ ఇప్పుడు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like