ఆయుధాలు వదిలేస్తాం : మావోయిస్టు పార్టీ
Maoist Party:తాము ఆయుధాలు వదిలేసి, చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. తాము ఆయుధాలు వదిలేస్తామని.. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఎన్ కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. సీపీఐ మావోయిస్టు అధికారి అభయ్ పేరిట ఈ లేఖ విడుదల అయింది.
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆయుధాలు విడిచిపెట్టేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా.. తమ పార్టీ ఆయుధాలు వదులు కోవాలని నిర్ణయించుకుంటున్నదని ఆ పార్టీ నేత అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటున్నదని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు, పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడుతామని వివరించారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రితో లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేదా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయడం తమ బాధ్యత అని, పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు చర్చల్లో అంగీకరించి పాల్గొనే సహచరుల నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో, జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు నెలరోజుల గడువు ఇస్తూ ‘సీజ్ ఫైర్’ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియోకాల్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ బసవరాజు మృతి తరువాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగా ఆయన స్థానంలో తిప్పిరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదల అవ్వడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతిచర్చలకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి విజ్ఞప్తి చేస్తున్నట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇదే ప్రతిపాదనపై మే 10న మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసినట్టు తాజా లేఖలోనూ మావోయిస్టులు తెలిపారు. అందులో తమ పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్టు ప్రస్తావించారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వానికి కాల్పుల విరమణ సైతం ప్రతిపాదించినట్టు వివరించారు.
కాగా, ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అన్నట్టుగానే మావోయిస్టు పార్టీకి కంచుకోట అయిన దండకారణ్యంలోకి చొచ్చుకువెళ్లి మరీ ఎన్‌కౌంటర్లు చేయిస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే మహారాష్ట్ర ,జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టు దళపతి నంబాల కేశవరావ్ అలియాస్ బసవరాజుతో సహా అగ్రనేతలు నేలకొరిగారు. చలపతి, గాజర్ల రవి, మనోజ్ తో సహా పెద్ద ఎత్తున అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. అదే సమయంలో భారీగా లొంగుబాట్లు సైతం చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది నేతలు లొంగిపోయేందుకు సిద్ధం అయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలివేస్తున్నామనే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ గతంలో ఇలాంటి ప్రకటనలు చేయకపోవడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటనగానే భావిస్తున్నాయని సమాచారం.