ఇందిరమ్మ ఇల్లు డబ్బులు పక్కదారి..
Indiramma house:ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి అవకతలు జరగకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే అధికారులు, నాయకులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లలో ఏదైనా తప్పు జరిగితే తనకు ఫోన్ చేయాలని ఏకంగా మంత్రి జూపల్లి చెప్పినా వారి అవినీతి మాత్రం ఆగడం లేదు.
అవినీతికి రుచిమరిగిన అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తూ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒకరి పేరు మీద వచ్చిన ఇంటిని మరొకరి పేరు మీద చూపుతూ డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఇందిరమ్మ ఇల్లు డబ్బులు ఓ అధికారి దారి మళ్లించాడు. తీరా వ్యవహారం బయటకు వచ్చి లబ్ధిదారుడు నిలదీయడంతో డబ్బులు తిరిగి ఇస్తానని పత్రం సైతం రాయించి ఇచ్చాడు. కానీ, డబ్బులు ఇవ్వకపోవడంతో పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు ఎక్కింది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ముస్లె సంతోష్ భార్య ముస్లె నందాబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. అయితే, పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ ఆ గ్రామంలో ఉన్న మరో నందాబాయికి మంజూరు పత్రం అందించారు. అంతేకాకుండా, ఇల్లు కట్టకుండానే లక్ష రూపాయలు అకౌంట్లో వేశారు. సంతోష్ భార్య ముస్లె నందాబాయి ఎకౌంట్లో లక్ష రూపాయలు డ్రా చేయించి పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ ఆ డబ్బులు తీసుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన సంతోష్ గట్టిగా అడగడంతో లక్ష రూపాయలు తిరిగి ఇస్తానని పంచాయతీ సెక్రటరీ హామీ పత్రం రాసిచ్చాడు.
అయితే, ఈ నెల పదవ తేదీ వరకు డబ్బులతో పాటు ప్రొసిడింగ్ పత్రాన్ని ఇస్తానని సంతోష్ కు చెప్పిన కార్యదర్శి ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. తనను మోసం చేసిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.