ఇమేజీ డ్యామేజీ…
యూరియా కోసం రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే
Miryalaguda MLA Bathula Lakshma Reddy: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలోని లక్షమంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని, రేవంత్ రెడ్డిని కోరారు. కోరడమే కాకుండా, ఏకంగా రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు కూడా.. ఆయన గన్‌మెన్ పుణ్యమా అని తన ఇమేజీ డ్యామేజీ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే…?
యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ కొద్ది రోజుల నుంచి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా యూరియా కోసం లైన్లు కడుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్.. రైతులకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్‌లో అమ్మి అడ్డంగా దొరికిపోయాడు. లారీ యూరియా లోడ్‌ను గన్‌మెన్ నాగు నాయక్ బ్లాక్‌లో అమ్మేసినట్లు తేలింది. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏను అంటూ పరిచయం చేసుకుని లారీ లోడ్ యూరియాను పక్కదారి పట్టించాడు.
ఎమ్మెల్యే నష్టనివారణ చర్యలు..
ఈ వ్యవహారం కాస్తా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అసలే యూరియా లేక రైతులు గోసపడుతుంటే లారీ లోడ్ యూరియా పక్కదారి పట్టించడం ఏమిటని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎమ్మెల్యేపై అస్త్రాలుగా వాడుతున్నారు. అది అటు ఎమ్మెల్యేకు… ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే నష్టనివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన నియోజకవర్గంలో ప్రతి రైతులకు ఒక్క యూరియా బస్తా కోసం రూ. 2 కోట్ల విరాళంగా అందచేశారు.
ఈ మధ్యే తన కుమారుడి వివాహం కాగా, భారీఎత్తున రిసెప్షన్ చేయాలని భావించిన ఎమ్మెల్యే దానిని రద్దు చేసుకున్నారు. దానికి అయ్యే డబ్బులను రైతులకు యూరియా బస్తాల కోసం అందించారు. ఎమ్మెల్యే కొడుకు సాయిప్రసన్న, కోడలు వెన్నల చేతుల మీదుగా ఈ చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. కాగా, ఎమ్మెల్యే చేసిన ఈ పనిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. చూడాలి మరి.. రైతుల అనుగ్రహం కోసం ఎమ్మెల్యే చేసిన ఈ ప్రయత్నం ఏ విధంగా ఫలిస్తుందో..