యూరియా కోసం టోకెన్ల పంపిణీ.. తోపులాట..
అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. నిత్యం యూరియా కోసం బారులు తీరడం, దొరికిన ఒక్క బస్తాతో తృప్తి పడుతున్నారు. రాత్రినక, పగలనక రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారు. తాజాగా శుక్రవారం బేల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రాథమిక సహకార సంఘం ఎదుట క్యూలో రైతులు, మహిళలు నిలబడ్డారు. పోలీసుల పహారాలో యూరియా పంపిణీ సాగుతోంది.
మరోవైపు పోలీసులే టోకెన్లు ఇచ్చి రైతులకు యూరియా పంపిణీ జరిగేలా చూశారు. టోకెన్ల పంపిణీ చేస్తుండగా తమకు టోకెన్లు కావాలంటూ రైతులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఓ రైతు ఏఎస్ఐ మీద పడటంతో, ఆయన తూలి మహిళా రైతులపై పడబోయారు. దీంతో ఏఎస్ఐ రైతును తోసేశారు. ఇలా పలు చోట్ల యూరియా పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.