సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు
-కార్మికులకు 35% లాభాల వాటా వెంటనే ప్రకటించాలి
- తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
TBGKS:సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, కార్మికులకు 35% లాభాల వాటా వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని సింగరేణి భవన్ ముట్టడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయంలో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాక కార్మికులందరూ ఆందోళనలో ఉన్నారన్నారు.
2023-24 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాల్లో 33% ఇవ్వకుండా కేవలం 16% మాత్రమే ఇచ్చి అభివృద్ధి పేరిట రూ. 2,289 కోట్లు పక్కన పెట్టారని, ఇప్పటివరకు వాటి ఖర్చు వివరాలు తెలియజేయలేదన్నారు. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ లాభాలు వచ్చాయని వాటి నుంచి 35% కార్మికులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో అడగకుండానే అనేక హక్కులు ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కార్మికులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఈశ్వర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం తలపెట్టే చర్యలకే పాల్పడుతున్నదని, కార్మికుల ఇవ్వాల్సిన హక్కులను ఇవ్వకుండా ఉన్న హక్కులను సైతం పోగొట్టే విధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
సింగరేణి కార్మికుల ఓట్లు దండుకోవడానికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అవేమీ అమలు చేయడం లేదన్నారు. ఉన్న హక్కుల్ని తీసేసి చర్యలకు పాల్పడుతున్నది దానిలో భాగంగానే 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి లాభాల వాటా పంచడంలో విపరీతమైన జాప్యాన్ని చేస్తోందన్నారు. మొత్తంగానే లాభాల వాటా ఎగ్గొట్టె కుట్రలో భాగంగా సింగరేణి సంస్థ చాలా నష్టాల్లో ఉందని ఈ సంస్థ రానున్న పది సంవత్సరాలలో మూతపడే ప్రమాదం ఉందని చెబుతూ కార్మికులందరినీ భయాందోళ చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నదని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
దీన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదన్నారు. తప్పకుండా సింగరేణి కార్మిక వర్గాన్ని మొత్తం ఏకం చేసి మొత్తం బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శులు కాపు కృష్ణ. కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పర్లపల్లి రవి, కుసన వీరభద్రం, ధరావత్ మంగీలాల్, అన్వేష్, బండి రమేష్, నాగలి సాంబయ్య, బడితెల సమ్మయ్య, గడప రాజయ్య, నాగేల్లి వెంకటేశ్వర్లు, మేడిపల్లి సంపత్, రత్నం అవినాష్, పొగాకు రమేష్, పానుగంటి సత్తయ్య, పెట్టం లక్ష్మణ్ ముదుంపల్లి రాజేశం దూట శేషగిరి వాసర్ల జోసెఫ్ ఉప్పులేటి పర్వతాలు, జనగామ మల్లేష్, అప్సర్‌పాషా, పుప్పాల రవీందర్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.