మంత్రి వ‌ర్సెస్ మంత్రి

War between Telangana ministers:ఇద్దరు మంత్రుల మధ్య జ‌రుగుతున్న వార్ సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఓ మంత్రిపై మ‌రో మంత్రి ఏకంగా సీవోఎంలో ఫిర్యాదు చేయ‌డం, ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు పంచాయ‌తీ వెళ్ల‌డంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. తనకు సంబంధం లేని అటవీశాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

మంత్రి వివేక్‌ తన నియోజవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళుతున్న రహదారులకు అటవీ క్లియరెన్స్‌, పోడు భూముల సమస్యలపై అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గంలోని పోడు భూములకు సంబంధించి సచివాలయంలో వివేక్‌ సమీక్ష నిర్వహించారు. ఆయ‌న ఏకంగా పీసీసీఎఫ్‌ సువర్ణ, కలెక్టర్‌, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ఈ స‌మీక్షా స‌మావేశం మంత్రి కొండా సురేఖకు చెప్పకుండా జ‌ర‌గ‌డంతో వివాదం నెలకొంది. ఈ విషయం మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. అటవీ శాఖ హెచ్‌ఓడీగా ఉన్న పీసీసీఎఫ్‌ను నేరుగా పిలవడమంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారినే పిలిచినట్టు అవుతుందని కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే త‌న‌కు తెలియ‌కుండా త‌న‌కు సంబంధించిన శాఖ అధికారుల‌తో ఉపాధి, గనుల శాఖ మంత్రికి అటవీ శాఖతో సంబంధమేంటని కొండా సురేఖ ఆగ్రహం వ్మక్తం చేశారు. దీనిపై అటవీ శాఖ అధికారులపై మంత్రి మండిపడ్డారు. జిల్లా, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారులను మాత్రమే సమావేశానికి పిలవాల్సిందని కొండా పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. మంత్రి వివేక్ మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించిన అటవీ అంశాలు కావడం మూలంగానే ఆ అధికారులతో మాట్లాడానని అన్నట్లు సమాచారం.

అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపై కొండా సురేఖ మండిపడటం చర్చనీయాంశంగా మారింది. కాగా సీఎం రేవంత్ ముందు ఈ పంచాయ‌తీకి ఫుల్‌స్టాప్ ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like