జిల్లా వ్యవసాయాధికారి స‌స్పెన్ష‌న్‌

Komuram Bheem District Agriculture Officer suspended:యూరియా పంపిణీలో నిర్లక్ష్యంపై సర్కార్ సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యం, యూరియా పంపిణీ లో పర్యవేక్షణ లోపం గుర్తించిన ఉన్న‌తాధికారులు ఏకంగా జిల్లా వ్య‌వ‌సాయాధికారినే స‌స్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. యూరియా పంపిణీ పర్యవేక్షణలో, సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని, విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం,కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించారనే అభియోగం పై కొమురం భీం జిల్లా(Komuram Bheem District) వ్యవసాయాధికారి ఆర్.శ్రీనివాస్ రావును స‌స్పెండ్ చేశారు. డీఏఓను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంచార్జి వ్యవసాయాధికారిగా సిర్పూర్ (యు) ADA వెంకటిని నియమిస్తూ ఆ ఉత్తర్వులు వెలువ‌డ్డాయి. అదే స‌మ‌యంలో ఉన్న‌తాధికారులకు స‌మాచారం లేకుండా జిల్లా కేంద్రం విడిచివెళ్ల‌వ‌ద్ద‌ని ఆర్‌. శ్రీ‌నివాస్‌ను ఆదేశిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొర‌త తీవ్రంగా వేధిస్తున్న‌ది. అదే స‌మ‌యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా స‌ర‌ఫ‌రాపై నియంత్ర‌ణ క‌రువైంది. రైతుల‌కు యూరియా దొర‌క్కుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దానికి తోడు రెండు రోజుల కింద‌ట లారీల్లో వ‌చ్చిన యూరియాను అర్ధ‌రాత్రి డీల‌ర్లు ఏకంగా గ్రామాల్లోకి వెళ్లి పంపిణీ చేస్తుండ‌గా దొరికిపోయారు. ఇది ఒక్క చోట కాదు.. రెండు చోట్ల ఇలాగే జ‌రిగింది. ఇక, బ‌య‌ట‌కు వ‌చ్చిన ఘ‌ట‌న‌లే ఇలా ఉంటే.. రానివి ఎన్ని ఉన్నాయో అని రైతులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా, యూరియా పంపిణీలో నిర్ల‌క్ష్యం, క‌లెక్ట‌ర్ ఆదేశాలు సైతం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న‌పై వేటు వేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

You might also like