లాభాల వాటా ప్రకటిస్తున్నం.. రండి…
Singareni:సింగరేణిలో ప్రతి ఏటా ఆ సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు సైతం వాటా ఇవ్వడం ఆనవాయితాగా వస్తోంది. ప్రతి ఏడాది ఆ సంస్థ నేరుగా ప్రకటించేది. అయితే, ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కార్మిక సంఘ నేతలను పిలిపించుకుని ముఖ్యమంత్రే కేసీఆర్ ఈ లాభాల వాటా ప్రకటన చేసేవారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఓ అడుగు ముందుకేసింది. లాభాల వాటా ప్రకటన మీరు రండంటూ ఏకంగా ఆహ్వాన పత్రికే ముద్రించింది. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ బలరామ్ పేరుతో ఈ ఆహ్వాన పత్రిక ముద్రించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దలు, కార్మిక సంఘ నేతలు జనక్‌ప్రసాద్, వాసిరెడ్డి సీతారామయ్య… ఇలా దాదాపు 52 మంది పేర్లు ఉన్నాయి.
ఉదయం 10.45 నిమిషాలకు లాభాల వాటా ప్రకటన ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేస్తారని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. లాభాల వాటాకు సంబంధించి తమకు పేరు రావాలని కోరుకోవడం సహజమే అయినా, ఆహ్వాన పత్రికలు ముద్రించి మరీ ఇంత హంగూ ఆర్భాటం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ కష్టానికి వచ్చే ప్రతిఫలం మాత్రమేనని దీనికి ఇంత హంగామా ఎందుకని సింగరేణి కార్మికులు ప్రశ్నిస్తున్నారు.