లాభమెంత..? ఇచ్చేదెంత..?
Profit share for Singareni workers:సింగరేణి కార్మికులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న లాభాల వాటా నేడు ప్రభుత్వం ప్రకటించనుంది. వాటాకు సంబంధించి ఇప్పటికే ఆలస్యం అయన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, సింగరేణికి వచ్చిన లాభాలు ఎన్ని..? కార్మికులకు ఇచ్చేదెంత..? కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా 35 శాతం ఇస్తారా..? అది కూడా వాస్తవ లాభాల్లో ఇస్తారా..? లేక గత ఏడాది లాగే సింగరేణి అభివృద్ధి కోసమని కొన్ని డబ్బులు పక్కన పెట్టి మిగతా వాటిల్లో నుంచి కార్మికులకు ఇస్తారా..? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది…
సింగరేణి యాజమాన్యం 2024-25 ఆర్థిక సంవత్సర లాభాలను నేడు ప్రకటించనుంది. యేటా దసరాకు ముందుగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను యాజమాన్యం అందజేస్తుంది. వాస్తవానికి ఇప్పటికే ఈ లాభాల వాటా చెల్లించాల్సి ఉండగా, ఈసారి కాస్తా ఆలస్యమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు రూ.2, 412 కోట్ల లాభాలు వచ్చాయి. ఇందులో 33శాతం లాభాల వాటా చెల్లించారు. రూ.796కోట్లు కార్మికులకు వాటా రూపంలో పంపిణీ జరిగింది. కేవలం 10 రోజులు మాత్రమే దసరాకు వ్యవధి ఉన్నా ఇప్పటికీ సింగరేణి యాజమాన్యం 2024-25 ఆర్థిక సంవత్సర లాభాలనే ప్రకటించలేదు. అయితే సింగరేణిలోని కార్మిక సంఘాలు మాత్రం గడిచిన ఆర్థిక సంవత్సరం లాభాల నుంచి కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ కూడా 35శాతం వాటాను కోరుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు సింగరేణి యాజమాన్యం ఈ వాటాను నిర్దారించి పంపిణీ చేస్తుంది.
రూ. 900 కోట్లకు పైగా లాభాలు..
2024-25ఆర్థిక సంవత్సరం కూడా సింగరేణి సంస్థకు సుమారు రూ.3 వేల కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టు సింగరేణి ఫైనాన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లాభాలపై 35శాతం కార్మికులకు ప్రభుత్వం వాటా ప్రకటిస్తే రూ.900 కోట్లకు పైబడి కార్మికులకు లాభాల వాటా వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి 69.01మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సంస్థ లాభాలను ఎంత ప్రకటిస్తుంది, అసలు నికర లాభాలు ఎంత, దానిపై రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఎంత శాతం వాటాను లాభాల బోనస్‌గా చెల్లిస్తుందనే విషయంపై నేడు స్పష్టత వస్తుంది.
నికర లాభాల నుంచి ప్రకటించాలి..
సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల్లో నుంచి కార్మికులకు వాటా ఇవ్వాలి. అయితే, గతేడాది కాంగ్రెస్ సర్కార్ 33 శాతం వాటా ఇస్తామని ప్రకటించినా, చివరికి ఇచ్చింది 16.90 శాతమేనని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.2,283 కోట్లు సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన పెట్టి, మిగిలిన రూ.2,414 కోట్లలోనే 33 శాతం వాటా రూ. 796 కోట్ల కార్మికులకు ఇచ్చారు. లాభాల్లో వాటా రూ.4,701 కోట్లలో 33 శాతం రూ.1,550 కోట్లు రావాల్సింది. కేవలం 16.90 శాతంతో సరిపెట్టారు. ఈసారైనా నికర లాభాల్లో కార్మికులకు వాటా చెల్లిస్తారా..? లేక మళ్లీ అలాగే సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన పెట్టి మిగిలిన వాటిల్లో నుంచే కార్మికులకు ఇస్తారా..? వేచి చూడాలి.