కార్మికులను కాంగ్రెస్ దగా చేస్తోంది..

TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి

సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించే విషయంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నాంది న్యూస్ తో మాట్లాడుతూ సింగరేణి సాధించిన నికర లాభాలపై కార్మికులకు వాటా చెల్లించాల్సి ఉండగా అందుకు భిన్నంగా కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. సంస్థ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులను పక్కనపెట్టి నామమాత్రం లాభాలను చూపించారనీ దుయ్యబట్టారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి కార్మికుల కష్టంతో రూ. 6394 కోట్లు లాభాలు సాధిస్తే, అందులో రూ. 4034 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టడం కార్మికులను మోసం చేయడం కాదా…? అని ప్రశ్నించారు. కేవలం రూ. 2,360 కోట్లు లాభాలుగా పేర్కొంటూ అందులో 34% వాటా ఇస్తున్నట్లు చెప్పడం కార్మికులను దారుణంగా మోసం చేయడమేనన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ. 4,701 కోట్లు లాభాలు ఆర్జిస్తే అందులో సంస్థ అభివృద్ధి కోసమని రూ. 2,289 కోట్లు పక్కన పెట్టి కేవలం రూ. 2, 412 కోట్ల లాభాలపై 33% వాటాగా చెల్లించారనీ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏనాడు కూడా నిధులను పక్కన పెట్టలేదనన్నారు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై మాత్రమే వాటాను చెల్లిస్తూ వచ్చామన్నారు. కార్మికులకు వాటా పెంచినట్లు చెబుతూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ మోసంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారనీ, రానున్న రోజుల్లో నికర లాభాలపై 34 శాతం వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో దశల వారి ఆందోళనలను చేపడతామని మిర్యాల రాజి రెడ్డి హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like