ప్ర‌జాభ‌వ‌న్ సాక్షిగా ప‌చ్చి మోసం

TBGKS Honorary President Koppula Eshwar:ప్ర‌జాభ‌వ‌న్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల‌కు ప‌చ్చి మోసం చేసింద‌ని TBGKS గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న గోదావరిఖని ప్రెస్ క్లబ్లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. సంస్థకు గతేడాది కన్నా ఎక్కువ లాభాలు వచ్చాయని, త‌మ‌కు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని కార్మికులకు ఆశపడ్డారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో వాస్తవ లాభాల్లో లాభాల వాటా ప్ర‌క‌టించామ‌ని చెప్పారాయ‌న‌. కానీ, గ‌త సంవ‌త్స‌రం.. ఈ ఏడాది రెండుసార్లు వేల కోట్ల‌ను ప‌క్క‌న పెట్టి కార్మికుల‌కు తీర‌ని అన్యాయం చేసింద‌న్నారు. ఈ ఏడాది లాభాలు రూ. 6,394 కోట్ల లాభాలు వస్తే రూ. 4,034 కోట్లు పక్కన పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. మిగిలిన రూ. 2,360 కోట్లలో 34 శాతం మాత్ర‌మే ప్రకటించార‌ని కొప్పుల ఈశ్వ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కార్మికుల‌కు ద‌క్కేది కేవ‌లం 12.8 శాతం మాత్రమే
గ‌త ఏడాది సైతం 2023- 24 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.4,701 కోట్ల‌ లాభాల్లో రూ.2,289 కోట్ల విస్తరణ పేరిట పక్కన పెట్టి, రూ.2,412 కోట్లలో 33 శాతం ఇచ్చిందని.. అంటే కేవ‌లం రూ. 796 కోట్లు మాత్రమే కార్మికులకు పంచిందన్నారు. ఈసారి వాస్తవ లాభాలు రూ. 6,394 కోట్లు వస్తే రూ.4,034 కోట్లు విస్తరణ పేరిట పక్కన పెట్టి, రూ. 2,360 కోట్లలో 34 శాతం మాత్ర‌మే ప్రకటించింద‌ని. అంటే కేవ‌లం రూ. 802 కోట్లు మాత్రమే కార్మికులకు చెల్లించనున్నారని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ లెక్క‌న గ‌త ఏడాది కార్మికుల‌కు కేవ‌లం రూ.16.9 శాత‌మే లాభాల వాటా చెల్లించార‌ని, ఈసారి ఇంకా దారుణంగా 34 శాతం అంటే కేవ‌లం 12.8 శాతం మాత్రమే కార్మికులకు చెల్లించనున్నారని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌జాభ‌వ‌న్ సాక్షిగా మోసం చేశారు..
గత ఏడాది విస్తరణ పేరిట పక్కన పెట్టిన రూ. 2,289 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కొప్పుల ఈశ్వ‌ర్ డిమాండ్ చేశారు. దీనికి ప్రజాభవన్ లో అట్ట‌హాసంగా కార్య‌క్ర‌మం ఎందుకు..? సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి మోసం చేయడం ఎందుకు..? అని ప్ర‌శ్నించారు. 13 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త‌ కేసీఆర్ దే అని స్ప‌ష్టం చేశారు. ఇచ్చిన ఆ వార‌స‌త్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్ర చేస్తోంద‌న్నారు. గతంలో నెలకు 2 మెడికల్ బోర్డులు నిర్వహిస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 నెలల‌కి ఒక బోర్డు కుడా నిర్వహించడం లేదని దుమ్మెత్తిపోశారు. సింగరేణి ప్రైవేటీకరణ బీఆర్ ఎస్ వ్యతిరేకించిందని, కానీ కాంగ్రెస్ వేలం లో పాల్గొంటుందని వెల్ల‌డించారు.ఇప్పటికైనా నికర లాభాల పైన వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామ‌ని ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు.

రెండోసారి ద‌గా చేసింది… మిర్యాల రాజిరెడ్డి
రేవంత్ సర్కార్ సింగరేణి కార్మికులను రెండోసారి దగా చేసిందని TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్ప‌ష్టం చేశారు. గతంలో ఒక్కో కార్మికునికి లక్షా 90 వేలు వస్తే, ఈసారి లక్షా 95 వేలు మాత్రమే వస్తున్నాయని ఆయ‌న అన్నారు. కార్మికులను మోసం చేసి దండుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ అని ధ్వ‌జ‌మెత్తారు. గతేడాది పక్కన పెట్టిన డబ్బులు దేనికి ఖర్చు చేశారో ఎవరికి తెలియదన్నారు.. లాభాల వాటపై కార్మికులు అన్ని గమనిస్తున్నారని, కార్మికులతోపాటు ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మిర్యాల రాజిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేపటి నుండి TBGKS ఆధ్వ‌ర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపడతామ‌ని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like