మీ త్యాగం, శ్రమ, చరిత్ర ఎన్నటికీ మరవం..
CM Revanth Reddy:తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి (Singareni) కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరువలేమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సింగరేణి లాభాల్లో వాటా ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న దశలో బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణలో వారి భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందని చెప్పారు.
సింగరేణి లాభాల్లో 34 శాతం మేరకు 819 కోట్ల రూపాయలను బోనస్‌ను ప్రకటించామని, ఈ బోనస్ వల్ల ప్రతి కార్మికుడికి 1,95,610 రూపాయల చొప్పున ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ. 5 వేల చొప్పున బోనస్ అందజేయగా, ఈసారి రూ.5,500 చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. సింగరేణి అభివృద్ధిలో సహకరించిన కార్మిక సంఘాలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. బొగ్గు గనుల ద్వారా సింగరేణి మొత్తం జాతికే వెలుగులు అందిస్తోందని, దేశంలో పరిశ్రమలు లాభసాటిలో నడుస్తున్నాయంటే కార్మికుల శ్రమ ఎంతో ఉందన్నారు. శ్రమ శక్తిని నమ్ముకున్న కార్మికులకు లాభాల్లో వాటాలను పంచడంతో పాటు సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ కార్యక్రమాలు, కార్పొరేట్ రంగంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కార్మికుల సంక్షేమం, అభివృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
సింగరేణి సంస్థ కార్పొరేట్ రంగంతో పోటీ పడి తలెత్తుకునేలా భవిష్యత్తు పెట్టుబడులు, ప్రణాళికలతో ముందుకు వెళ్లే విషయంలో కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు రేవంత్‌రెడ్డి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల కోల్పోయిన రెండు గనులను తిరిగి సింగరేణి ఆధ్వర్యంలోకి తీసుకొచ్చే విషయంలో అన్ని మార్గాలను అన్వేషిస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంతో సింగరేణి కూడా పోటీ పడుతుందని, ఆయాచిత లబ్ది కోసం ప్రయత్నించడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు.
సింగరేణి మనుగడ, లాభాల ఆర్జన, ప్రపంచంతో పోటీ పడటం వంటి కీలక అంశాలపై కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమాలోచనలు చేసి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు పోతామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రం దాదాపు 7 వేల కోట్ల మేరకు ఆదాయం కోల్పోతోంది. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. జీఎస్టీ (GST) సవరణలతో ఏర్పడిన వ్యత్యాసాన్ని పూరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ఎంపీలు పోరిక బలరాం నాయక్ , రామసహాయం రఘురామిరెడ్డి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఐఎన్టీయుసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.