విదేశాల్లో ఉంటూ విద్వేష పోస్టులు.. అరెస్టు చేసిన పోలీసులు

టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన వ్యక్తిని ఆదిలాబాద్ పోలీసులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి రిమాండ్ త‌ర‌లించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రౌడీషీటర్ కైంచి సలీం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్ట్ పెట్టినందుకు ఏప్రిల్ నెలలో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, అత‌న్ని అరెస్టు చేశారు. ఆ సంఘటనపై షేక్ ఇర్ఫాన్ అనే వ్య‌క్తి పోలీసులను కించపరిచేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా విమర్శలు చేసి.. ఇరు వర్గాల మధ్య గొడవలు దారి తీసేలా పోస్టులు పెట్టాడు. అయితే, అత‌ను టాంజానియా దేశంలో ఉండ‌టంతో అప్ప‌టిక‌ప్పుడు అదుపులోకి తీసుకోవ‌డం సాధ్యం కాలేదు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి silsila adb అనే వాట్సప్ గ్రూపు యజమానిగా వ్యవహరిస్తున్న అత‌నిపై ఏప్రిల్ 15న ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు న‌మోదు చేశారు.

అతను వేరే దేశంలో ఉండ‌టంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సుతో అతనిపై ఇమిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. షేక్ ఇర్ఫాన్ మంగళవారం టాంజానియా నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వ‌చ్చాడు. అతనిపై ఎల్ఓసి జారీ అయిన విషయాన్ని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకొని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అప్ప‌గించారు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఎస్సై పీర్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అతన్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆదిలాబాద్ డీఎస్‌పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇతనిని ఈరోజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు తరలించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా గొడవలకు దారి తీసేలా పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో పోలీసులను కించపరిచేలా, విధులకు భంగం కలిగించేలా, మనోభావాలకు దెబ్బతీసేలా పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతని వద్ద నుంచి పాస్ పోర్ట్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్ఐ పీర్ సింగ్, విష్ణు ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like