ఎమ్మెల్యేపై తిరుగుబావుటా

Bellampalli MLA’s backlash:బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మీద ఒక్క‌సారిగా అసంతృప్తి సెగలు రేగాయి. ఎమ్మెల్యే వినోద్ సీనియర్లను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వ‌హించారు నేత‌లు..పట్టణం లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అసహనం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారితో పాటు పీఏ ల ప్రాధాన్యం పెరగడం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్‌పై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర అంస‌తృప్తి చెల‌రేగుతోంది. ఆయ‌న పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది వారిని దగ్గర తీసుకొని సీనియర్లు, గెలుపు కోసం కష్టపడ్డ ముఖ్య కార్యకర్తలను దూరం పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని భ్ర‌ష్టు పట్టిస్తున్నారు…
ఎమ్మెల్యే గెలవటానికి కృషిచేసిన నాయకులను పట్టించుకోవడం లేదని, అసలు పార్టీ గురించి, ఎమ్మెల్యే గెలుపు గురించి ఎవరు కష్టపడ్డారు అనే విష‌యం కూడా తెలియ‌కుండా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేని అనామకులకు చేరదీస్తున్నారని… బెల్లంప‌ల్లిలో పీఏల పాలన నడుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని భ్ర‌ష్టు పట్టిస్తున్నారని… కొంద‌రి ప‌ని తీరు వ‌ల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమ, అభిమానం వ్యతిరేకతగా మారుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ వ్య‌తిరేక‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిబింబిస్తుంద‌ని వెల్ల‌డించారు.

ఎమ్మెల్యేదే పూర్తి బాధ్య‌త‌…
ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం సూరిబాబు ఎంతో కష్టపడ్డారని, సూరిబాబుకే స‌రైన‌ గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే సూరిబాబుని అవమానించార‌ని.. కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు BRS టీం, PAల టీం వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వెల్ల‌డించారు. సూరిబాబునే ఇలా చేస్తే ఇక మిగ‌తా వారి ప‌రిస్థితి ఏమిటో ఒక్క‌సారి ఆలోచించాల‌న్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ కష్టపడ్డ సీనియర్ నాయకులను, కార్యకర్తలను గుర్తించాలని లేక‌పోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనుగడకే కోలుకోలేని దెబ్బ అని వారు స్ప‌ష్టం చేశారు.

మండ‌లాల్లో మ‌రికొంత మంది…
అయితే, ఈ అసంతృప్తి కేవ‌లం ప‌ట్ట‌ణానికే ప‌రిమితం అయ్యింద‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల్లో సైతం ఇదే విధంగా నేత‌ల మ‌ధ్య గ్రూపుల త‌గాదా ఉందని ప‌లువురు చెబుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆయ‌న చుట్టు ప‌క్క‌ల ఉండే నేత‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని కొంద‌రు బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. మ‌రికొంద‌రు నేత‌లు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఈ వ్య‌వ‌హారాల‌న్నీ నేరుగా ఎమ్మెల్యేకు చెబుదామంటే చెప్పే వీలు లేకుండా పోతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించాల‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like