ఇంటి ముందు పందులతో నిరసన..
Protest with pigs in front of the house:నకిలీ భూమి పత్రాలు చూపించి నిరుపేదలైన అమాయకుల వద్ద రూ. 45 లక్షలు దండుకొని మోసం వ్యక్తులకు బాధితులు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. పందులను ఇంట్లోకి తోలి ఇంటి ముందర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లికి చెందిన రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివ, పాత మంచిర్యాలకు చెందిన బొలిశెట్టి భీమయ్య, భీమిని రాంపూర్ కు చెందిన మొండి, చిన్న బూదకు చెందిన లగిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తులు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న దుబ్బపల్లికి చెందిన బాలాని గంగరాజు, పూజారి సమ్మయ్య, పూజారి నాగేష్, దాసరి శ్యామ్, గోపి, పోల రాములు అనే వ్యక్తుల దగ్గర నుంచి రూ.45 లక్షలు వసూలు చేశారు. తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ శివారులో గల సర్వే నంబర్ 340/1, 341/బి లలో 12 ఎకరాలు తమ భూమి అని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. తీరా అవి నకిలీ అగ్రిమెంట్ పత్రాలను తేలింది.
డబ్బులను చెల్లించి రెండు నెలలు గడుస్తున్న భూమి అమ్మకానికి పెట్టిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కు రాకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు ఆరా తీయగా భూ మాయగాళ్ళ వలలో పడి మోసపోయినట్లు గుర్తించారు. దీంతో ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తమ కుటుంబాలతో బట్వాన్ పల్లి గ్రామానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు తమను మోసం చేసిన రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివ ఇండ్ల ముందు ఆందోళనకు దిగారు. వందమందికి పైగా గ్రామస్తులు మహిళలు, చంటి పిల్లలతో అక్కడే వంటలు చేసుకుని రాత్రి రోడ్డుపై అక్కడే నిద్రించారు.
తమకు మధ్యవర్తిగా వ్యవహరించి డబ్బులు దండుకున్న పాత మంచిర్యాలకు చెందిన బొలిశెట్టి భీమయ్య అనే వ్యక్తిని తమ అదుపులో ఉంచుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ గ్రామంలోనే ఉంటామని చెబుతున్నారు. తాము పందులను పెంచుకుని జీవనం సాగిస్తుంటామని, తమను మోసం చేసి ఇలా చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు కుటుంబాలకు చెందిన వారి వద్ద డబ్బులు వసూలు చేశారని వెల్లడించారు. బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన రామటెంకి హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సర్పంచ్ భర్త అతని తమ్ముడు శివ మరికొంత మంది కలిసి దొంగ పట్టా పాస్ పుస్తకాలు ఫోర్జరీ చేసి ఎవరికో చెందిన భూమి తమ భూమి అని మోసం చేశారన్నారు. తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.