అమెరికా షట్‌డౌన్
America shutdown:అనుకున్నట్టుగా అయ్యింది.. అగ్రరాజ్యం అమెరికా షట్‌డౌన్ ప్రకటించింది. ఏడు సంవత్సరాల విరామం తర్వాత 2025 అక్టోబర్ 1న (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30) అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్తోంది. ఈ పరిణామానికి కారణం, ప్రభుత్వ ఖర్చులకు నిధులను సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమవడమే. సెనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కలేదు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం 11.59 నిమిషాల వరకు ఆ బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూశారు. డెమోక్రాట్లు తగ్గకపోవడంతో ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. ఫండింగ్ బిల్లు సెనేట్‌లో పాస్ కాకపోవడం వల్ల నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌజ్ తెలిపింది. గడిచిన ఏడేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
అసలు ఈ షట్‌డౌన్ అంటే ఏంటి..?
సాధారణంగా ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి, సేవలను కొనసాగించడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. అమెరికాలో ఈ నిధులను సమకూర్చడానికి కాంగ్రెస్ బడ్జెట్ లేదా నిధుల బిల్లును ఆమోదించాలి. అయితే రాజకీయ విభేదాలు, ప్రతిష్టంభన కారణంగా నిర్ణీత గడువులో నిధుల బిల్లును ఆమోదించలేకపోతే ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి నిధులు లభించవు. ఇలాంటి పరిస్థితిలో అవసరం కాని ప్రభుత్వ సేవలను నిలిపివేయాల్సి ఉంటుంది. నిధులు ఆమోదం పొందే వరకు కొన్ని ప్రభుత్వ విభాగాలు, సేవలు మూసివేస్తారు.
జీతం లేకుండా పని చేయాల్సి వస్తుంది..
షట్‌డౌన్ సమయంలో అనేక వేల మంది ఫెడరల్ ఉద్యోగులు జీతం లేకుండా సెలవుపై పంపిస్తారు. కొంతమంది జీతం లేకుండా పని చేయాల్సి వస్తుంది. ఈసారి షట్‌డౌన్ ముప్పు మరింత తీవ్రమని అంచనా వేస్తున్నారు. ట్రంప్ దీన్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించి, లక్షలాది ఉద్యోగులను తొలగిస్తారని, అనేక కీలక ప్రాజెక్టులను నిలిపివేస్తారని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ ప్రజల జీవితంలో, ప్రభుత్వ సేవలందించడంలో తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది.
బిల్లు పాస్ కాకపోవడంతోనే..
పెద్దల సభ సేనేట్‌లో రిపబ్లికన్ పార్టీకి కేవలం 54 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఫండింగ్ బిల్లుకు ఆమోదం దక్కాలంటే 60 ఓట్లు తప్పనిసరి అవుతుంది. తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు డెమోక్రాట్లు ఫండింగ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేదు. బిల్లుకు అనుకూలంగా 55 ఓట్లు, వ్యతిరేకంగా 45 ఓట్లు పోలయ్యాయి. దీంతో బిల్లు పాస్ కాలేకపోయింది. ఆరోగ్య సబ్సిడీల గురించి డెమోక్రాట్లు పట్టపట్టారు. మెడిక్ ఎయిడ్ కోతల అంశంలో రిపబ్లికన్లు వెనక్కి తగ్గాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనూ ట్రంప్ హయాంలోనే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. గత ఏడాది కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తప్పింది. ఈసారి మాత్రం షట్‌డౌన్ ముప్పు తప్పించుకోలేకపోయింది.