పోలీసుల‌కే వార్నింగ్ ఇచ్చిన I BOMMA

I BOMMA:మీరు మాపై ఫోక‌స్ చేస్తే.. మేము మీపై ఫోక‌స్ చేస్తామంటూ ఆన్‌లైన్ పైర‌సీ వెబ్ సైట్ I BOMMA ఏకంగా పోలీసుల‌కు, సినిమా రంగానికి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేర‌కు హైద‌రాబాద్ పోలీసుల‌కు ఒక లేఖ విడుద‌ల చేసింది.

‘మ‌మ్మ‌ల్ని చేత‌నైతే ప‌ట్టుకోండి.. ఫస్ట్ కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే సైట్లపై దృష్టి పెట్టండి. మా సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం…. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు… ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది. తగ్గేది లేద’ని ఐ బొమ్మ వెబ్ సైట్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తంది. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న సినీ పైరసీ వెబ్‌సైట్ I BOMMA వ్యవహారం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇప్ప‌టికే తెలుగు చిత్ర నిర్మాత‌ల‌తో పాటు హీరోల‌ను బెదిరిస్తూ వ‌స్తున్న ఈ వెబ్‌సైట్ తాజాగా హైద‌రాబాద్ పోలీసుల‌ను ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

పైర‌సీ క‌ట్టడి చేయాల‌ని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సెల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో ఐ బొమ్మతో సహా సుమారు 65కి పైగా వెబ్‌సైట్‌లు తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్నాయని వెల్ల‌డించారు. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినీ పైరసీ రాకెట్‌లో ఒకదానిని ఛేదించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ పైరసీ వల్ల 2024లోనే తెలుగు సినీ పరిశ్రమ దాదాపు ₹3,700 కోట్లు నష్టపోయిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. థియేటర్లలో రహస్యంగా రికార్డింగ్ చేయడం (Cam-cording), డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్‌లను హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్‌లను దొంగిలించడం వంటి రెండు పద్ధతుల్లో వీరు పైరసీకి పాల్పడుతున్నారని తెలిపారు.

పైరసీ రాకెట్‌ ఛేదించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీ సీవీ ఆనంద్, ఐ బొమ్మ వంటి పైర‌సీ వెబ్‌సైట్‌లను ఉద్దేశిస్తూ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఐ బొమ్మతో సహా ఇతర పైరసీ సైట్‌ల నిర్వాహకులు ఎంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా వారిని ట్రాక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Cloudflare వంటి నెట్‌వర్క్‌ల ద్వారా వెబ్‌సైట్‌లను దాచిపెట్టినా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సహాయంతో వాటి మూలాలను ఛేదిస్తామని తెలిపారు.

ఈ వ్య‌వ‌హారంపై I BOMMA (ఐ బొమ్మ) స్పందిస్తూ.. ఒక లేఖ విడుద‌ల చేసింది. మీరు మాపై ఫోక‌స్ చేస్తే.. మేము మీపై ఫోక‌స్ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపింది. తమ వెబ్‌ సైట్‌బ్లాక్‌ చేస్తే మీ ఫోన్‌ నంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు.. OTTలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయంటూ తెలిపింది. మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే.. ఆపడం అసాధ్యమ‌ని… మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరంటూ ప్ర‌క‌టించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like