కమిషనరేట్ లో ఆయుధ పూజ
విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, అధికారులు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి ఉంటుందన్నారు. అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలన్నారు.
పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం, రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయి మరింత పెరిగేలా పని చేయాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ జరుపుకుంటారని అన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం వాహనాల పూజ నిర్వహించి అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపిఎస్., పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, రాజేంద్ర ప్రసాద్,ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, వామన మూర్తి, సంపత్, సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.