తెరపైకి సింగరేణి కార్మికుల జీవితాలు
Singareni:సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాలు ఇలా మొత్తం సింగరేణి ఇతివృత్తంగా సినిమా రూపొందించనున్నారు. ఈ విషయాన్ని సినీ నటుడు సాగర్ వెల్లడించారు. సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, మొగలిరేకులో సీరియల్ ఆర్కే అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. అంతలా తన నటనతో ఆకట్టుకున్నాడు నటుడు సాగర్. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు సాగర్..
చాలా గ్యాప్ తరువాత ఈ నటుడు ఇటీవలే ‘ది 100’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలోనే మరో కొత్త సినిమాను ప్రకటించాడు నటుడు (Sagar)సాగర్. తెలంగాణలోని సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి ఆవిష్కరించాలనేది తన ప్రయత్నమని చెప్పాడాయన. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ‘జార్జ్ రెడ్డి’ సినిమా చేసిన దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెప్తున్నారు.
అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నట్టు తెలిపారు. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకుంటున్నట్టు సూచించారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని వెల్లడించాడు.