ముంచుకొస్తున్న తుఫాన్
The approaching storm:వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో తుఫాన్ ముంచుకొస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫాను అయిన శక్తి శుక్రవారం గుజరాత్ తీరం వెంబడి ద్వారక వైపు కదులుతోంది ఇది మరింత తీవ్రమవుతుందని వాతావరణ కార్యాలయం తెలిపింది.
ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందా..? అనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ -వాయవ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది.. తుఫాన్‌గా మారనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారవచ్చని అంచనా వేసింది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో హైలర్ట్ ప్రకటించారు. తీవ్రతుఫాన్‌గా మారితే ఊహించని విధంగా ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని… ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేందుకు సంసిద్ధం కావాలని ఆదేశించారు.
అయితే ఈ శక్తి తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉంటుందా..? లేదా…? అనే విషయంలో సమాచారం లేనప్పటికీ.. ఎందుకైనా మంచిది, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మొత్తంగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తొలి తుఫాన్ శక్తిగా దూసుకొస్తుండటంతో భారత వాతావరణశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుఫాన్‌ను ప్రతిక్షణం అంచనా వేస్తూ తీర ప్రాంత రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది.