బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంలో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ నేత‌లు

Telangana Local Body Elections Bc Quota : రేపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. హస్తినలో సీనియర్ న్యాయవాదులను కలవనున్నారు.

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇప్పటికే జీవో ఇవ్వడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ఆర్డినెన్స్ తీసుకు రావడం వంటి పరిణామాలు జరిగాయి. స్థానిక సంస్థలకు సంబంధించి జీవో నెంబర్ 9 కూడా ఇచ్చింది. అయితే, 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ కేసులు వేశారు. దీనిపై సోమ‌వారం వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ క్రమంలో దీనిపై అఫిడవిట్ దాఖలు చేసి బలమైన వాదనలు వినిపించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

సుప్రీంకోర్టులో తమ వాదనలను బలంగా వినిపించాల‌ని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరప‌నున్నారు. 42శాతం రిజర్వేషన్లు ప్రకటించడానికి కారణాలు ఏమిట‌నేది న్యాయవాదులకు వివరించి, వారి ద్వారా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ఆలోచన చేస్తున్నారు. గతంలో బిహార్ లో రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో సుప్రీంకోర్టే 50శాతం క్యాప్ విధించింది కాబట్టి క్యాప్ ను అధిగమించి తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు వింటామని అత్యున్నన న్యాయస్థానం తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like