సింగరేణి సమ్మె జయప్రదం చేయండి
బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రవేటికరణకు వ్యతిరేకంగా సింగరేణిలో జరిగే సమ్మె విజయవంతం చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా ఐకే1ఏ లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణికి రావాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిలో అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, కాంట్రాక్టికరణకు వ్యతిరేకంగా సమ్మెకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదు జాతీయ కార్మిక సంఘాలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి డిసెంబర్ 9,10,11 తేదీలలో సింగరేణిలో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. నాలుగు బ్లాకులను ప్రైవేటు వారికి ఇచ్చే నోటిఫికేషన్ రద్దు చేసి సింగరేణి పరిశ్రమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి భూగర్భ గనులలో బొగ్గు తీసే ప్రక్రియ సింగరేణి కార్మికులతోనే చేయించాలని, కాంట్రాక్టికరణ రద్దు చేయాలన్నారు. మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి, ఏఐటీయూసీ నేత సమ్మయ్య, అనిల్ రెడ్డి బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి నాతాడి శ్రీధర్ రెడ్డి, పొడిశెట్టి వినోద్ కుమార్, చంద్రశేఖర్,పెండం సత్యనారాయణ, మంచినీళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు