మా పాలన మాకేనని తిరగబడ్డ గోండు బిడ్డ
KomuramBheem:’కొర్రాసు నెగడోలే మండిన ధీరుడతను.. రగరగ సూరీడై రగిన వీరుడతను.. అతను ఒక అగ్గి బారాటా… పోరాట యోధుడు.. మీసం మెలితిప్పిన వీరుడు.. గెరిళ్ళ పోరాటంలో మడమ తిప్పని త్యాగధనుడు.. ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే.. తన గోండు జాతికి జరుగుతన్న అన్యాయాలు అక్రమాలపై తుడుం మోగించి నిజాం సర్కారుపై పోరుసల్పిన ధీరుడిని కన్న నేల ఇది.. అందుకే ఈ నేల మట్టి, ఇక్కడి గాలి, నీరు ఎప్పుడూ పిడికిలి బిగిస్తూనే ఉంటాయి.
కొమురంభీమ్.. ఈ పేరు చెబితే చాలు నిజాం సర్కారుకు దడ. అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ, సోంబారు దంపతులకు అప్పటి ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లిలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది.
ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు. భీం కుటుంబం పది హేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఐదేళ్లపాటు కాఫీ, తేయాకు తోటల్లో కూలీగా పనిచేశారు. ఆ సమయంలో కార్మిక ఉద్యమాలను చూశారు. చదవడం, రాయడంతో పాటు కొన్ని ఇతర భాషలను కూడా నేర్చుకున్నారు. తన సన్నిహిత మిత్రుడు కొమరం సూరు ద్వారా.. తన ప్రాంతంలో జరిగే పరిస్థితుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు.
అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. అప్పటి నిజాం ప్రభుత్వం పశువులను మేపడానికి, వంట కోసం కట్టెలు సేకరించడానికి బంబ్రం, దుప్పపెట్టి పేరుతో పన్ను వసూలు చేసేవారు. అంతేకాకుండా గిరిజనులపై అరాచకాలు కొనసాగించింది. వీటికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్‌కు కుడిభజంగా కొమురం సూరు, వెడ్మ రాము కూడా భీమ్‌కు సహచరులుగా పోరాటాల్లో పాల్గొన్నారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో తుడుం మోగించాయి. కొమురం భీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు.
ఈ నీరు-అడవి-భూమిపై హక్కులు తమవేనంటూ కొమురం భీమ్ ఉద్యమం ప్రారంభించారు. తద్వారా ఆదివాసీలలో స్ఫూర్తిని నింపారు. ఆదిలాబాద్‌లోని దాదాపు 12 గ్రామాలు తమ భూముల కోసం పోరాటానికి సిద్ధమయ్యాయి. గోండు, కోయ యువకులతో భీమ్ గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆయుధాలతో పోరాడటానికి గిరిజన ప్రజలను సేకరించి శిక్షణ ఇచ్చారు. ఆయన గెరిల్లా యుద్దానికి జోడేఘాట్ ప్రధాన ప్రదేశంగా మారింది. ఈ యుద్ధం చూసి ఆశ్చర్యపోయిన నిజాం సైన్యం ఆదివాసీలపై దాడికి ప్రయత్నించింది. అయినా కొమురం భీమ్ నిజాం సైన్యానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారు. కుర్దు పటేల్ అనే వ్యక్తి కొమురం భీమ్ దాక్కున్న స్థలం గురించి నిజాం సైన్యానికి తెలిపాడు.
అడవి ఏడ్చిన రోజది.. ఆశ్వీయుజ పౌర్ణమి. 1940 అక్టోబర్ 27న కుర్దు పటేల్ ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ వద్ద భీమ్, ఆయన అనుచరులను చుట్టుముట్టిన నిజాం సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. భీమ్, ఆయన 12 పన్నెండు మంది అనుచరులు సైతం ప్రతిఘటించారు. అయినా శత్రువులు ఎక్కువ మంది ఉండటంతో ఈ పోరాటంలో కొమురంభీమ్తో పాటు ఆయన 12 మంది అనుచరులు వీరమరణం పొందారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఆశ్వీయుజ్ఞ పౌర్ణమి భీమ్ వర్ధంతిగా ఆదివాసీలు జరుపుకుంటారు.