పోలీసు ఇంటికే కన్నం వేసిన దొంగలు..
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. చందానగర్ ఇటీవల ఖజానా జ్యువెలర్స్‌తో పాటు పలు దేవాలయాల్లో చోరీ ఘటనలు మరువక ముందే.. తాజాగా రెండు తాళం వేసిన ఇళ్లల్లో చోరీ చేశారు దుండగులు. మరోమారు రెచ్చిపోయిన దొంగలు రెండు ఇళ్లల్లోకి చొరబడి భారీ దొంగతనానికి పాల్పడ్డారు. రైల్వే విహార్‌లోని పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ఇంట్లోని 5 తులాల బంగారం, 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓల్డ్ ఎంఐజీలోని సీతారామ్మూర్తి అనే రిటైర్డ్ బీహెచ్ఎల్ ఉద్యోగి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 18 తులాల బంగారం, 60 తులాల వెండి, కొంత నగదు అపహరించారు. యజమాని రామ్మూర్తి కుటుంబం గత నెల 29 సత్యసాయి బాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లింది. తిరిగి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.