కొమురం భీమ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం..
A tribute to Komuram Bheem:ఆదివాసుల ఆరాధ్య దైవం, అమరజీవి కొమురం భీమ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కెరమెరి మండలం జోడెన్ ఘాట్ లో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ 85వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ అని అన్నారు. భీమ్ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమంలో ముందుకు సాగుదామన్నారు.
ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా జండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొమురం భీమ్ మనుమడు కుమ్రం సోనే రావు దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. కాంతిలాల్ సుభాష్ పాటిల్, ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖష్బూ గుప్తా, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, అదనపు ఎస్.పి. చిత్తరంజన్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా గిరిజనాభివద్ధి అధికారి రమాదేవి, కుమ్రంభీమ్ మనుమడు కుమ్రం సోనే రావు, ఉత్సవ కమిటీ సభ్యులు హాజరై కొమురం భీమ్‌కు ఘనంగా నివాళి అర్పించారు.