రిజర్వేషన్లపై రాజ్యాంగంలో పరిమితి లేదు
Arguments in the High Court regarding BC reservations:రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో సుప్రీం కోర్టు ఆదేశం తప్పితే రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వాదనలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. పిటిషనర్ల తరఫున వాదనలు ముగిసిన తర్వాత ప్రభుత్వం తరఫున లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీం కోర్టు ఆదేశం మాత్రమే ఉందని, రాజ్యాంగంలో ఈ పరిమితికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదని తెలిపారు.
ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. బిల్లు గవర్నర్‌కు పంపి ఆరునెలలు అవుతోందని, బిల్లు ఆయన ఆమోదించలేదు.. తిరస్కరించలేదన్నారు. ఆయన ఆమోదించాలి లేకపోతే రాష్ట్రపతికి పంపించాలని తెలిపారు. 2018లో పంచాయతీ రాజ్ చట్టం పాసైన సందర్భంలో ఈ కసరత్తు జరగలేదన్నారు. 2019లో ఈడబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయన్నారు. ఫలితంగా రిజర్వేషన్లు 50 శాతం దాటి 60 వరకు చేరాయని స్పష్టం చేశారు. జీవోపై స్టే ఇవ్వాలనడం సరికాదని అభిషేక్ మను సింఘ్వీ అభ్యంతరం తెలిపారు.
ప్రభుత్వం చేసిన సర్వేలో 97శాతం ఇంటింటి సర్వే జరిగిందన్నారు. లక్ష మంది ఎన్యుమరేటర్లతో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. శాస్త్రీయ బద్దంగా సర్వే జరిగాకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు చేశారని అన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరిగిందని తెలిపారు. సర్వేలో 56 శాతం బీసీలు ఉన్నారని తేలిందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ సమయంలో స్టే ఇవ్వాలని కోరడం సమంజసం కాదన్నారు. పూర్తి వాదనలు విన్నాకే నిర్ణయం వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు అభిషేక్ మను సింఘ్వీ..