సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లే
Telangana High Court:రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టేనని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ సూచనలు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బీసీ జనగణన చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు.
బీసీ జనగణను శాస్త్రీయంగా నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తేలిందని తెలిపారు. 2018లో బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా జరగలేదన్నారు. తమిళనాడులో సుప్రీం తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చిలో బిల్లు ఫైలును గవర్నర్కు పంపిచామని ఏజీ ధర్మాసనం ముందుంచారు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదన్నారు. ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
మరోవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నోటిఫికేషన్ కాపీని కోర్టు ధర్మాసనం ముందుంచారాయన. దానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆయన తన వాదనలు వినిపించారు.