కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత‌లు ఏమ‌న్నారంటే..

కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత‌లు స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు నేత‌లు మాట్లాడారు.

సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించాం. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసింది. సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించింది. శాసన సభలో చట్టం చేసి గవర్నర్‌కు పంపించాం. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం. స్థానికసంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్‌, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలి.

బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటై అడ్డుకున్నారు.. మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎవరు చేయలేని సాహసం చేసింది. ఇంటింటికి తిరిగి కులగణన చేసిన త‌ర్వాతే 42 శాతం బీసీ రిజర్వేషన్లు రూపొందించాం. బీఆర్ఎస్‌, బీజేపీ క‌లిసి బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం 42శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీలకు న్యాయం జరగాలి.

ఇది విచార‌క‌రం… మంత్రి వాకిటి శ్రీహరి
బీసీలకు 42శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా స్టే విధించడం విచారకరం. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం. కానీ కోర్టు తీర్పు ఊహించలేదు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చినం. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయం. 42 శాతం బీసీల రిజర్వేషన్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్ కు పంపించాం.. గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారు.

నోటి కాడ ముద్ద లాక్కున్నారు.. మాజీ ఎంపీ వీ. హనుమంత రావు
కోర్టు తీర్పు చాలా బాధ కలిగించింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నోటి దగ్గరి ముద్దను లాక్కున్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున చేయాల్సింది చేశాం. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో మేం అడ్డుకోలేదు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా..?. న్యాయ వ్యవస్థలో బీసీలు వచ్చే వరకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది.

సీఎం రేవంత్‌రెడ్డి ఒంట‌రి పోరాటం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైకోర్టు తీర్పుతో చాలా నిరాశ చెందాం. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు. కులగణనతో పాటు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీల లెక్క తేల్చాం. మేం నిరాశ చెందం.. పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడుతాం. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దు.. సీఎం రేవంత్ నాయకత్వంలో తప్పనిసరిగా రిజర్వేషన్లు సాధించుకుంటాం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like