పోలీసుల నిర్లక్ష్యం, చేతగానితనం వల్లనే మధూకర్ ఆత్మహత్య
BJP District President Nagunuri Venkateswar Goud:పోలీసుల నిర్లక్ష్యం, చేతగానితనం వల్లనే వేమనపల్లి మండలం నీల్వాయిలో ఏట మధూకర్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. నీల్వాయి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కంట్రోల్లో కాకుండా కాంగ్రెస్ నేతల కంట్రోల్లో ఉందన్నారు. ఎవరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.. ఎవరు వెళ్లిపోతున్నారంటూ కాంగ్రెస్ నేతలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారుని దుయ్యబట్టారు. పోలీస్‌స్టేషన్‌లో పిటిషన్ ఇచ్చి బయటకు వెళ్లగానే హోంగార్డులు వారికి సమాచారం ఇచ్చి కాంగ్రెస్ వారికి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పోలీస్‌డిపార్ట్‌మెంట్ కు పనిచేస్తారా…? కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారా..? అని ప్రశ్నించారాయన.
మధూకర్ ఆత్మహత్య కేవలం పోలీసు అధికారుల నిర్లక్ష్యవైఖరి, చేతగానితనం వల్లనే అని దుయ్యబట్టారు. ఏట మధూకర్ మీద తెచ్చిన ఒత్తిడి అధికార పార్టీ నేతల మీద ఎందుకు పెట్టలేదని వెంకటేశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. మీరు కాంగ్రెస్ నాయకుల ఇండ్లలో పనిచేయాలంటూ నీల్వాయి ఎస్ఐపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు జీతం ఇస్తున్నారా..? ప్రభుత్వం జీతం ఇస్తోందా…? అని ప్రశ్నించారు. మీరేం ఉద్యోగం చేస్తున్నారు.. హోంగార్డులు కూడా మీ కంట్రోల్లో పనిచేయడం లేదని, కాంగ్రెస్ నేతల కంట్రోల్లో పనిచేస్తున్నారంటూ దుయ్యబట్టారు.