పోలీసుల నిర్ల‌క్ష్యంతో నిందితులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నారు

Mancherial District BJP President Nagunuri Venkateswar Goud:వేమ‌న‌ప‌ల్లి మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడు ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్యకు కార‌కులైన నిందితులు పోలీసుల నిర్ల‌క్ష్యంతోనే స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌ని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్(Mancherial District BJP President Nagunuri Venkateswar Goud) స్ప‌ష్టం చేశారు. ఆయ‌న చెన్నూరు పట్టణంలో విలేక‌రుల‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలీసులు ఈ కేసు విష‌యంలో మొద‌టి నుంచి ప‌క్ష‌పాతధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. ఎస్ఐ పాత్ర ఉంద‌ని తాము పిటిష‌న్‌లో ఇస్తే.. ఎస్ఐ పేరు తీసేంత వ‌ర‌కు రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు పిటిష‌న్ తీసుకోలేద‌న్నారు. నిందితుల‌ను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఏమిట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. హైకోర్టుకు వెళ్లి మరీ పిటిషన్ వేశారని దుయ్య‌బ‌ట్టారు.

నిందితులు కాంగ్రెస్ పార్టీ నేతలు కాబట్టే వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నీల్వాయి ఎస్సై కోటేశ్వరరావు నిందితులలో ఒకరికి చుట్టం కాబట్టే కేసును నీరుగారుస్తున్నారని తెలిపారు. ఏట మధుకర్ మృతి చెంది ఏడు రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఏ ఒక్క నిందితున్ని కూడా పట్టుకోలేదని… దానికి కారణాలేంటో చెప్పాలని ప్రశ్నించారు. సాధార‌ణ వ్య‌క్తి చిన్న త‌ప్పు చేసినా, పోలీస్ డిపార్ట్‌మెంట్ ప‌ట్టించుకోకుండా ఉంటుందా..? అన్నారు. మీ ద‌గ్గ‌ర నిందితుల ఫోన్ నంబ‌ర్లు లేవా..? అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.

చెన్నూరులో జ‌రిగిన బ్యాంక్ కుంభ‌కోణంలో రెండు రోజుల్లో నిందితుల‌ను బెంగ‌ళూరు వెళ్లి ప‌ట్టుకున్నారు.. క‌దా..? ఆ ఉత్సాహం ఈ కేసు విష‌యంలో ఏమైంద‌న్నారు. బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్(Bellampalli MLA Vinod) ప్రేమ ఒల‌క‌బోశారు.. చాలా సంతోషం కానీ, నిందితులు ఎక్క‌డ ఉన్నారో మీకు తెలియదా అన్నారు. చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు క‌దా..? ఆత్మ‌హ‌త్య కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు ఎందుకు చేయ‌లేద‌న్నారు. మీరు వీడియోలు, ప్ర‌సంగాలు చేయ‌డం కాదు.. త‌క్ష‌ణ‌మే నిందితుల‌ను అరెస్టు చేయించాల‌న్నారు. మీ ఇంట్లో ఉన్న‌రు కాబ‌ట్టే పోలీసులు రావ‌డం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కావాల‌నే కేసు నీరుగార్చే ఉద్దేశంతో పోలీసు డిపార్ట్‌మెంట్ ప‌నిచేస్తోంద‌న్నారు. బీజేపీ పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి బండి సంజయ్ నిందితులను పట్టుకోవాలని చెప్పినా ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని అన్నారు. రేపు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథ రావు వచ్చిన అనంతరం తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ హెచ్చ‌రించారు. ఈ స‌మావేశంలో బీజేపీ నేత దుర్గం అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like