సొంత బావ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా…?
Kavitha Janam Bata: సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారా అని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కవిత మాట్లాడుతూ తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వార్త వినగానే కడుపులో దేవినట్లయ్యిందని కవిత అన్నారు. సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అని మరోమారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు, జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత ఆరోపించారు.
బీఆర్ఎస్‌లో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగితే భరిస్తాను… కానీ అవమానాన్ని మాత్రం సహించబోనని అన్నారు. ఆత్మగౌరవం కోసమే తాను పార్టీతో విభేదించానని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని కవిత అన్నారు. జనంబాట పట్టాక బీఆర్ఎస్ నేతలు తనతో టచ్‌లోకి వచ్చారని చెప్పారు. తనకు అన్యాయం జరగడంతో పార్టీ నుంచి బయటికి రాలేదన్నారు. అవమానం జరిగింది కాబట్టే ఆత్మగౌరవం కోసం బయటికి వచ్చానని వెల్లడించారు. ఎవరైనా మొదటిసారి అన్యాయం చేసినప్పుడు మౌనంగా ఉంటే, మళ్లీ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారన్నారు.
మొంథా తుపాన్ (Cyclone Montha)తో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కవిత పరామర్శించారు. ఈ ఏడాది వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని చెప్పారు. మెులకలు వచ్చి, బూజు పట్టి, తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు.