30 రోజుల్లో ఎనిమిది ఉగ్ర కుట్రలు భగ్నం
Eight terror plots foiled in 30 days:ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు(Bomb blast at Red Fort) తీవ్ర విషాదాన్నే నింపింది. ఇప్పటి వరకు మొత్తం 11 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో అప్పటికే భద్రతా బలగాలు, ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ లాంటివి అప్రమత్తమై, అక్కడికి చేరుకున్నాయి. దర్యాప్తును కూడా ప్రారంభించాయి. ఈ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ ఉగ్రవాది సానుభూతిపరుడు, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ కీలక పాత్ర పోషించాడని కూడా స్పష్టం అయ్యింది. అంతేకాకుండా ఈ పేలుడులో డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు తేల్చేశారు. భారత భద్రతా బలగాలు వెనువెంటనే అప్రమత్తమై, దర్యాప్తు వేగిరం చేశాయి.
అయితే… గత 30 రోజుల్లో 8 సార్లు ఇస్లామిక్ ఉగ్రవాదుల వ్యూహాలన్నింటినీ భారత భద్రతా బలగాలు, నిఘా సంస్థలు తుత్తునీయలు చేశాయి. వారు రచించిన ప్రతి వ్యూహాన్ని కూడా మొగ్గలోనే తుంచేసి, భారత ప్రజలను సురక్షితంగా వుంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గత 30 రోజుల్లో 8 సార్లు భారత భద్రతా బలగాలు ప్రజలను అనేక ఉపద్రవాల నుంచి కాపాడాయి..
– ఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలో 2900 కిలోల పేలుడు పదార్థాలను, 5 కిలోల భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇస్లామిక్ ఉగ్రవాదుల మాడ్యుల్ దురాగతం బయటపడింది.
– ఇక.. ఈ నెల తొమ్మిదో తేదీన (9) గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ISIS ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు భారత్ లో పేలుళ్లకు రచన చేశారు. వీరి వ్యూహాన్ని కూడా భద్రతా బలగాలు ముందుకు సాగనీయలేదు.
– ఇదే నెల ఏడో తేదీన (7) నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో సంబంధాలున్న ఒసామా ఉమర్ అనే మౌల్వీని రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేసింది. వీరంతా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్ర కమాండర్లతో సంబంధాలు నెరుపుతున్నారు.
– గత నెల అక్టోబర్ 28 వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ ఐటీ ఉద్యోగిని మహారాష్ట్ర ఏటీఎస్ పూణెలో అరెస్ట్ చేసింది. అంతేకాకుండా అతనిపై UAPA కింద కేసులు కూడా నమోదు చేసింది.
– గత నెల అక్టోబర్ 24 న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించింది. దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు వేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసింది. ఢిల్లీ మధ్యప్రదేశ్‌లలో సమన్వయంతో దాడులు చేసిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. అనుమానితులలో ఒకరిని దక్షిణ ఢిల్లీ నుండి అరెస్టు చేయగా, రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.
– అదే నెల 17 వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దర్ని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిది యూపీ కాగా, మరొకరిది మహారాష్ట్ర.
– అదే నెల 15 న పాకిస్తాన్‌తో సంబంధాలున్న సరిహద్దు వ్యవస్థీకృత ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు, అమృత్‌సర్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి 10 అధునాతన పిస్టళ్లు, 500 గ్రాముల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
– అదే పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ టెర్రర్ మాడ్యుల్ ను ఛేదించారు. పేలుళ్లకు ప్రణాళిక వేసిన జలంధర్ కి చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాటు RDX అమర్చిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.