మహిళా కాంగ్రెస్ నాయకురాలికి పరోక్ష హెచ్చరిక
-మహిళా కాంగ్రెస్ నాయకురాలికి పరోక్ష హెచ్చరిక
-ఆడియో బయటికి ఎలా వెళ్లిందంటూ ఆరా
-డబ్బులు వసూళ్లు చేసేవారినే ప్రోత్సహిస్తున్నారు
-ఎమ్మెల్యే గెలుపు కోసం ఎంత కష్టపడినా ఫలితం లేదు
-పీఏను ఫోన్లోనే గట్టిగా నిలదీసిన మహిళా నాయకురాలు
”మేడం ఎక్కడ ఉన్నారు… మన నాయకుడు మీతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఎలా బయటికి వచ్చింది. మీరు ఎవరికి పంపారు. అది నాదాకా వచ్చింది. పీఏలకు డబ్బులు ఇస్తారని ఎవరో చెబితే అది నిజం అయిపోతుందా..? మీరు ఆ రికార్డు ఎందుకు బయటికి ఇచ్చారు…? నేను సీఎం బర్త్‌డేకు వెళ్తున్నా.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి..”
ఇదీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ ఓ కాంగ్రెస్ మహిళా నాయకురాలితో ఫోన్లో మాట్లాడిన మాటలు.. గతంలో ఈ మహిళా నాయకురాలితో మరో నాయకుడు మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయి. మూడు లక్షల రూపాయలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిద్దాం.. డబుల్ బెడ్రూంలకు ఇచ్చే రూ. 3 లక్షలు నాకు ఒక్కడికే కాదు. కాంగ్రెస్ నేతలు, పీఏలకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని గతంలో ఓ ఆడియో కాల్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ కాల్ బయటకు రావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన ఎమ్మెల్యే పీఏ ఆ మహిళా కాంగ్రెస్ నేతతో మాట్లాడారు. రెండు, మూడు సార్లు తనతో మాట్లాడిన ఆయన పరోక్షంగా జాగ్రత్త అంటూ చేసిన హెచ్చరిక సంచలనం కలిగిస్తోంది. ఆ ఆడియో కాల్ మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే పీఏ జాగ్రత్త అనగానే ఆ మహిళా నాయకురాలు జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటీ అంటూ ప్రశ్నించారు. దానికి పీఏ ఏమైనా ఉంటే ఇట్ల అనవసరంగా స్ప్రెడ్ చేసుకోవద్దని చెప్తున్నా అంతే.. నీకు నిజంగా ఏమైనా సమస్య ఉంటే నేరుగా ఎమ్మెల్యేతోని మాట్లాడు.. సార్ కూడా నీకు డైరెక్ట్ చెప్తార కదా. నీకు సార్ తెల్వదా.. సార్ దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్లాలా? మధ్యలో నీకు ఎవ్వరన్న అవసరమా? సార్ నిన్ను గుర్తుపట్టడా.. ? అన్నారు.
దీంతో ఆ మహిళా నాయకురాలు పీఏను గట్టిగానే నిలదీసింది. డబుల్ బెడ్రూం ఇండ్లకు డబ్బులు వసూలు చేసేంత స్వేచ్ఛ మీరు ఆ నాయకులకు ఎందుకు ఇచ్చారు. మీరు ఇంత ఎంకరేజ్ చేయ కపోతే వాళ్లకు అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది. సార్ క్లోజ్, పీఏలు క్లోజ్.. పీఏలకే డబ్బులు కావాలని నాయకుడు అంత బహిరంగంగా ఎలా చెప్తాడు. పార్టీ కోసం కష్టపడిన నన్ను, నా భర్తను ఎందుకు తొక్కేస్తూ, వేరే వాళ్లను ఎందుకు అంత లేపుతున్నారు. ఎమ్మెల్యే సార్‌కు మీరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కారణంగానే కదా.. కష్టపడిన వారిని గుర్తింపు రావడం లేదంటూ ప్రశ్నించింది. దానికి పీఏను నేను తర్వాత మాట్లాడుతాను అంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు.