లంచం రూపం మారింది.. ఏసీబీ దాడులు చేసింది..

ACB Raids:ఏసీబీ అధికారులు శుక్ర‌వారం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌పై దాడులు నిర్వ‌హించారు. ఇందులో ప్ర‌ధానంగా కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఫోన్ల యూపీఐ లావాదేవీల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించి… వాటిపై విచార‌ణ చేశారు..
—————————————————————
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఉద్యోగుల అకౌంట్లలో అనుమానిత లావాదేవీలు….నిన్న ఏసీబీ అధికారుల తనిఖీలలో గుర్తించిన అధికారులు.. ముగ్గురు ఉద్యోగాలకు ఆన్ లైన్ లో రూ.70 వేల చొప్పున వచ్చినట్టుగా నిర్థారణ… అవి ఎవ‌రు పంపారు…? ఎందుకు పంపారు..? దానిపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

తెలంగాణ‌లో అధికారులు తెలివిమీరిపోతున్నారు. ఏసీబీ దాడులు(ACB Raids) పెరిగిపోతుండ‌టంతో లంచాలు నేరుగా తీసుకోకుండా యూపీఐ యాప్‌(UPI Apps)ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఫోన్‌పే(Phone Pe), గూగుల్ పే(Google Pay) ద్వారా లంచాలు పంపించేలా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే శుక్ర‌వారం రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాపైన ఏక‌కాలంలో దాడులు నిర్వ‌హించింది. అధికారులు, కార్యాల‌య సిబ్బంది ఫోన్ల‌లో ఫోన్‌పే, గూగుల్‌పే ఇత‌ర లావాదేవీల‌పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.

UPI ద్వారా లంచాలు…
అవినీతి నిరోధక శాఖ (ACB) దాడుల నేప‌థ్యంలో కొంతమంది అవినీతి అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బాధితుల నుండి నేరుగా నగదు తీసుకోవడానికి బదులుగా, లంచం మొత్తాన్ని UPI ద్వారా పంపమని అడుగుతున్నారు. వాస్త‌వానికి అధికారులు లంచం తీసుకున్న‌ప్పుడు ర‌సాయ‌నాలు పూసిన డ‌బ్బులు తీసుకునేప్పుడు ACB అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటారు. ఇతర ఆధారాలతో పాటు, కరెన్సీ నోట్లపై ఉన్న అధికారుల వేలిముద్రలు కోర్టులో కేసును నిరూపించడానికి ACBకి బలమైన సాక్ష్యం ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా మూడు ఘ‌ట‌న‌లు..
అయితే, ఇలా దొరికిపోకుండా ఉండ‌టానికే అవినీతి అధికారులు వేరు మార్గాన్ని ఎంచుకున్నారు. లంచాన్ని PhonePe, Google Pay, Paytm ఇతర UPI యాప్‌ల ద్వారా పంపమని అడుగుతున్నారు. అది కూడా సొంత మొబైల్‌కు కాకుండా, వారి అసిస్టెంట్లు, ఇత‌ర నంబ‌ర్ల‌కు పంపించ‌మ‌ని చెబుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్‌లో మూడు సంఘటనలు జరిగాయి. పెద్దపల్లి మండల సర్వేయర్ పెండ్యాల సునీల్, ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి రైతు భూమి స‌ర్వే చేసేందుకు రూ. 10,000 లంచం తీసుకోగా ACB అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో నగదుకు బదులు, సునీల్ ఫోన్‌పే ద్వారా ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ఫోన్ నంబర్‌కు ఆ మొత్తాన్ని పంపమని ఫిర్యాదుదారుడిని కోరాడు. మంచిర్యాలలో సైతం సర్వేయర్ మంజుల కూడా బాధితురాలిని లంచం మొత్తాన్ని UPI ద్వారా పంపమని కోరారు. వరంగల్‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

మంచిర్యాల‌లో అనుమానిత లావాదేవీలు..
ఈ నేప‌థ్యంలోనే శుక్ర‌వారం రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌పై దాడులు నిర్వ‌హించారు. మంచిర్యాల‌లో నిర్వ‌హించిన దాడుల్లో మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫిస్ లో ఉద్యోగుల అకౌంట్ల లో అనుమానిత లావాదేవీలు ఏసీబీ అధికారులు గుర్తించారు. యూపీఐ లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీయ‌డంతో ముగ్గురు ఉద్యోగుల ఫోన్ల‌కు ఆన్ లైన్ లో రూ.70 వేల చొప్పున వచ్చినట్టుగా నిర్థారించారు. అవి ఎవ‌రు పంపారు….? ఎందుకు పంపారు…? అనే దానిపై ఏసీబీ వివరాలు సేక‌రిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో సైతం నిన్ననే త‌నిఖీలు చేసి అనుమానిత లావాదేవీలు , లోపాలపై అడిగి తెలుసుకున్నారు.

ఇలా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో గుర్తించిన లోపాలు, యూపీఐ లావాదేవీల‌పై ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like